ఏలూరు జిల్లా : దెందులూరు : ది డెస్క్ :

చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. దెందులూరు మండలం కాట్లంపూడిలో దీపక్ నెక్స్ జెన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు, జాలిపూడిలో నిర్మించిన రజక సంఘం ఫంక్షన్ హాల్, బాబు ఖాన్ గూడెంలో నిర్మించిన ఆలయ ప్రహరీ గోడ, తిమ్మారావుగూడెంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఆదివారం ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ… గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సకాలంలో పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచాయని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న కేసులో క్లియరెన్స్ తీసుకొని, అనుమతులు వచ్చిన వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.
మాదేపల్లి కాలువ ద్వారా దెందులూరు మండలంలోని 6 గ్రాముల ప్రజలకు సాగు, తాగునీరు సరఫరా చేయడానికి రూ.78 లక్షలు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అంచనాల నివేదిక పంపినట్లు ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ఎంపీ మహేష్ కుమార్ సహకారంతో దెందులూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సామాజిక సేవలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్న దీపక్ నెక్స్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యంను ఎంపీ మహేష్ కుమార్ అభినందించారు. ఆయనకు ఎమ్మెల్యే ప్రభాకర్ తో కలసి శాలువలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.