- అవి అందమైన గోదావరి లంకలు – లోపల అంతా పాడు పనులే..‼️
- గోదావరి లంకల్లో అసాంఘిక కార్యకలాపాలు
- నిత్యం జూదం, కోడిపందేల నిర్వహణ
- నాటుసారా తయారీకి అడ్డాగా మారిన లంకలు
🔴 రాజమహేంద్రవరం : ది డెస్క్ :
చుట్టూ నీళ్లు, మధ్యలో ఇసుక తిన్నెలతో గోదావరి లంకలు ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే పర్యాటకంగా అభివృద్ధి చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. పోలీసు పర్యవేక్షణ లేక, జూదం, కోడిపందేలకు అడ్డా అవుతున్నాయి. రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డు నుంచి చూస్తే కనుచూపు మేరలో లంకలు కనిపిస్తుంటాయి.
చుట్టూ గోదావరి నీరు, మధ్యలో ఇసుక పాయలతో చూడముచ్చటగా ఉంటాయి. ఐతే ఈ లంకలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. నిత్యం కోడిపందేలు, జూదం నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాల సంగతి సరేసరి. ఎలాంటి అనుమతులు లేకుండా నాటుపడవల్లో లంకల్లోకి చేరుతున్న జనం, జూదక్రీడల్లో మునిగి తేలుతున్నారు. అలాగే రాత్రీ, పగలు తేడా లేకుండా ఇక్కడ నాటుసారా తయారీ జరుగుతోంది. దీని వెనక పెద్ద మాఫియానే పనిచేస్తోంది.
వైఎస్సార్సీపీ హయాంలో ఈ లంకల్లో రేవ్ పార్టీలు సైతం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గోదావరి లంకలు పొదలతో నిండి ఉండటం వల్ల, లోపల ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియదు. ఇదే అదునుగా కొందరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా రాజమహేంద్రవరం, కొవ్వూరు నుంచి సుమారు 50 మంది నాటుపడవల్లో లంకల్లోకి చేరుకుని కోడిపందేలు, పేకాటలో పాల్గొన్నారు.
మద్యం మత్తులో తిరిగి వస్తుండగా బోటులోకి నీరు చేరి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఈ వ్యవహారంతో లంకల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. పుష్కర ఘాట్ సమీపంలో బోటు బోల్తాపడి ఇద్దరు చనిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లంకలపై నిఘా పెంచి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.
“ఇటీవల జరిగిన ప్రమాదం తరువాత పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. లంకల్లో నిఘా పెట్టాము. బోట్లపై కూడా నిఘా ఉంచాము. చేపలు పట్టడానికి కూకుండా వేరే వాటికి బోట్లను అనుమతించేది లేదు. అదే విధంగా మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశాము. అనుమతులు లేకుండా ఎవరినీ కూడా లంకలకు బోట్లలో తీసుకెళ్లకూడదు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం“.
➖ రమేష్ బాబు, సెంట్రల్ డీఎస్పీ, రాజమహేంద్రవరం