ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ, ఆయిల్ పామ్ రైతులు ఎంపీ మహేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ను ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఏలూరు జిల్లా పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేయడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఎంపీ మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెదవేగిలో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వ నుంచి మంజూరు చేయించాలని రైతులు ఎంపీ మహేష్ కుమార్ కు విన్నవించారు. తమరు చేసిన కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడం వల్ల ఆయిల్ పామ్ గెలల ధర పెరిగి తాము సంతోషంగా ఉన్నామని రైతులు ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేసిన విధంగానే పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రికవరీ శాతం పేరుతో రైతుల తెచ్చిన గెలలు గ్రేడింగ్ చేస్తూ పక్వానికి వచ్చిన గెలలు సైతం ఏరివేతను ఆపించడంతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో పెదవేగిలో నూతన ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవ చూపాలని రైతుల కోరారు. అన్నదాతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.