ఎన్టీఆర్ జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS :
ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో డివిజన్, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

2025 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను సన్నద్ధం చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే తక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు మరింత అవగాహన కల్పించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చూడాలన్నారు.
వీరితోపాటు రసాయనిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని సూచించారు.దీనికోసం వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు సెర్ప్ సిబ్బంది మండలం, గ్రామస్థాయిలో రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించాలని, ఇంటింటికి తిరిగి దాని ప్రయోజనాలను వివరించాలన్నారు.
అదేవిధంగా రైతులు పచ్చిరొట్ట మాత్రమే కాకుండా పొలంలో నవధాన్యాలను చల్లుకొని నేలను మరింత సారవంతంగా మార్చుకోవచ్చని, తద్వారా రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు ఎన్ పద్మావతి, జె జ్యోతి, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.