ఏలూరు జిల్లా : గణపవరం THE DESK NEWS :

కొల్లేరు ప్రాంత నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పరలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తో కలిసి శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పిప్పర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జి.ఎస్.ఆర్ విద్యా సంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు, విద్యావంతులను కలిసి ఎంపీ మహేష్ కుమార్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎంపీ కోరారు.

ఈ సందర్భంగా ఎంపి మహేష్ కుమార్ మాట్లాడుతూ… కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వివరించడానికి ఈనెల 20న అపాయింట్మెంట్ తీసుకున్నామని, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నేపద్యంలో వాయిదా పడిందని ఎంపీ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లా ఎమ్మెల్యేలు, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుస్తామని, కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ కు మద్దతుగా నిలవాలని ఎంపీ కోరారు. అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం బరిలో నిలిపిన అభ్యర్థులను ఆశీర్వదించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.