86 సంవత్సరాల తాతను 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు..‼️
🔴 TG : హైదరాబాద్ : సోమాజిగూడ : ది డెస్క్ :
దారుణ హత్యకు గురైన మృతుడు గతంలో ..ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి విడతలవారీగా 40 కోట్లు – తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్లు విరాళంగా ఇచ్చిన వైనం.
ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర(వీసీ) జనార్దనరావు (86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురి.
పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్‌రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ(29) పేరిట రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి.
గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో *తాతతో కీర్తితేజ వాగ్వాదానికి* దిగాడు.తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా.. ఇదే అదనుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు.
అరుపులు, కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయారు. ఆమెపైనా దాడిచేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావొద్దని హెచ్చరించాడు.
తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని పంజాగుట్టలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సరోజినీదేవి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కీర్తితేజ మాదకద్రవ్యాలకు బానిసనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
జనార్దనరావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్చంధ సంస్థలకు కూడా విరాళాలు అందజేశారు.
www.thedesknews.net