ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ దార్శినికతకు అద్దం పట్టిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎంపీ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో ఈసారి 5 వేల 936 కోట్ల రూపాయలు కేటాయించారని, అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో 54 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారని, పోలవరం సవరించిన అంచనాలు రూ. 30,436.95 కోట్లకు ఆమోదం తెలియజేయడంతో పాటు పోలవరం బ్యాలన్స్ గ్రాంట్ 12,157.53 కోట్ల రూపాయలుగా కేంద్రం తెలపడం పట్ల ఎంపీ మహేష్ కుమార్ స్వాగతించారు.
మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు శుభ పరిణామమని ఎంపీ తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు ఈరోజు కేంద్ర బడ్జెట్ ఉందని ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎంపీ పేర్కొన్నారు.
రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. జాతీయ శ్రేయస్సు వైపు కీలక అడుగులు సూచిస్తోందని తెలిపారు. బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కి ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.