ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS :
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, సహజసిద్ధ కొల్లేరు మంచినీటి సరస్సులో అక్రమ ఆక్రమణలు, అనధికార చెరువులను తొలగించి.. ఎగువనున్న ప్రాంతాలను ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించినట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ..జీవో ఎంఎస్ నెంబర్ 120 ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డిబేట్ డేట్ 1999 అక్టోబర్ 4న సుప్రీం కోర్టు ఉత్తర్వులను.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తరవులను అమలు చేయాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు విన్నవించానన్నారు.
కొల్లేరు సరస్సు వన్యప్రాణి అభయా రణ్యం ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, నిడమర్రు, భీమడోలు, కైకలూరు, మండవల్లి తదితర మండలాల్లోని 30,855 హెక్టార్లో విస్తరించి ఉందనీ.. కొల్లేరు సరస్సులో బుడమేరు మేజర్ డ్రైవ్‌తో పాటు తమ్మిలేరు, రామిలేరు, వంటి 67 గుర్తింపు పొందిన డ్రైన్లు, గుర్తింపు పొందని 46 డ్రైన్లలోని నీరు కలుస్తుందన్నారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులు మేరకు ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 వ సంవత్సరంలో 1776 చేపల చెరువులను తొలగించినప్పటికీ.. తరువాత 1776 చెరువులతోపాటు వేలాది ఎకరాల్లో అనాధికారిక చెరువులతో కొల్లేరు సరస్సు అక్రమ ఆక్రమణకు గురై బుడమేరు డ్రైన్ లోని నీరు కొల్లేరు సరస్సుకు వెళ్లనీ కారణంగా ఇబ్బందికరంగా మారిందన్నారు. దీని కారణంగా సెప్టెంబర్ 2024 లో ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు పోటెత్తి విజయవాడ నగరం అతలాకుతలమై నీట మునిగింది. దీంతో సుమారు 6 లక్షలమంది నిరాశ్రయులు కాగా.. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.
ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. కొల్లేరు సరస్సులో అక్రమ ఆక్రమణకు గురైన వేలాది ఎకరాల అనధికార చెరువులను తొలగించి.. ఆక్రమణలకు కారుకులైన సంబంధిత అటవీ శాఖ అధికారులపై చట్టబద్ధంగా తగు చర్యలు తీసు కోవాలని.. అలాగే, సుప్రీం కోర్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలయ్యేలా చూడాలని రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ కు అందించిన వినతిలో కోరానన్నారు.