The Desk…Eluru : టెండర్ల దశకు కాకినాడ- శ్రీకాకుళం పైపులైన్ ప్రాజెక్ట్ : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : టెండర్ల దశకు కాకినాడ- శ్రీకాకుళం పైపులైన్ ప్రాజెక్ట్ : ఎంపీ పుట్టా మహేష్

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలించి.. కాకినాడ నుండి శ్రీకాకుళం వరకు (విశాఖపట్నం మీదుగా) సహజవాయువు పైప్‌లైన్ ప్రాజెక్ట్ పనులకు అడుగు ముందుకు పడింది. ఈ పైప్ లైన్ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పెట్రోలియం మరియు సహజవాయువు నియంత్రణ మండలి చైర్మన్ అనిల్ కుమార్ జైన్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గత ఏడాది అక్టోబరు 21న స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు వినతిపత్రం అందజేశారు.

ఈ మేరకు ప్రాజెక్టు పురోగతికి సంబంధించి పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి కార్యదర్శి అంజన్ కుమార్ మిశ్రా లేఖ ద్వారా లిఖితపూర్వకంగా గురువారం సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ పైప్‌లైన్ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, కాకినాడ నుండి శ్రీకాకుళం వరకు సహజ వాయువు పైప్‌లైన్ వేసే బాధ్యత గెయిల్‌కు ఇవ్వాలనే అభ్యర్థనను పెట్రోలియం మరియు సహజవాయువు నియంత్రణ మండలి పరిగణలోకి తీసుకుంది.

తద్వారా ఇప్పటికే వేసిన పైప్ లైన్ ను ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీడీసీ స్వాధీనం చేసుకుంది. పైప్ లైన్ విషయంపై చర్చించిన బోర్డు 290 కి.మీల కోసం అధికారిక బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. జనవరి 17 న ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్, ఏప్రిల్ 14 లోపు బిడ్ సమర్పణకు, ఏప్రిల్ 16 సాంకేతిక బిడ్ ప్రారంభ తేదీతో పైప్ లైన్ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు.

టెండర్ల ప్రక్రియ అనంతరం పైప్ లైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలితంగా కాకినాడ- శ్రీకాకుళం పైప్ లైన్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతోంది. పైప్ లైన్ ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.