- ప్రజల మనస్సులో సుస్థిర స్థానం పొందిన ప్రజా నాయకుడు బడేటి బుజ్జి
- విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
బడేటి బుజ్జి ఏలూరు నియోజకవర్గానికి అహర్నిశలు కృషి చేసి ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు.

స్థానిక నరసింహరావుపేటలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏలూరు మాజీ శాసనసభ్యుడు దివంగత బడేటి బుజ్జి కాంస్య విగ్రహాన్ని గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు 36వ వర్ధంతి సందర్భంగా వంగవీటి రంగ కాశీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్,నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తదితరులు పాల్గొని స్వర్గీయ బడేటి బుజ్జి 5వ వర్ధంతి సందర్భంగా బడేటి బుజ్జి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. బడేటి బుజ్జి నిరంతరం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. ఏ పని చేపట్టినా పట్టువదలకుండా పూర్తి అయ్యేంతవరకు కృషిచేసేవారన్నారు. బడేటి బుజ్జి మనలో లేకపోయినా మన మనస్సులో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం , ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్ .టి. రామారావు ఆశయాలకు అనుగుణంగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి బడేటి బుజ్జి కృషి చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వములో అనేక పదవులు చేపట్టి బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషిచేసి, ఏలూరు ప్రాంత ప్రజలలో మనస్సులో బడేటి బుజ్జి సుస్థిర స్థానం పొందారన్నారు. ఏదైనా ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడే వ్యక్తి బడేటి బుజ్జి అని, 2014-19 సమయంలో బడేటి బుజ్జి తో సహచర ఎమ్మెల్యే గా పనిచేశానన్నారు. నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి సాదించుకునేవారన్నారు. బడేటి బుజ్జి బౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులలో ఎప్పటికీ నిలిచే ఉంటారని, వారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. బడేటి బుజ్జి వివాదాలకు ఆస్కారం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసారని, ఆయన ఆశయాలను, ఆలోచనా విధానాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాక్రిష్నయ్య (చంటి) మాట్లాడుతూ.. బడేటి బుజ్జి పేదప్రజల సంక్షేమానికి కృషిచేశారని, ఏలూరు నియోజకవర్గంలో పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి నేరుగా తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషిచేశారన్నారు. బడేటి బుజ్జి మన మధ్య లేకపోయినా ప్రజల మనస్సులలో శాశ్వతంగా నిలిచి ఉంటారన్నారు.
కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు , వలవల బాబ్జి,మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి రామకృష్ణ, ఆప్షన్ మేం ఎస్ ఎన్ ఆర్ పెదబాబు , ఎమ్ ఆర్ డి బలరాం, దాసరి ఆంజనేయులు, పలువురు కార్పొరేటర్లు, బడేటి బుజ్జి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బడేటి బుజ్జి అభిమానులు, ఫ్లాష్ సంస్థ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.