The Desk…Kaikaluru : జాతీయ రహదారి విస్తరణకు మాత్రమే మట్టి టిప్పర్లకు అనుమతి… నియోజకవర్గ పరిధి దాటి మట్టి తరలిస్తే సహించేది లేదు..

The Desk…Kaikaluru : జాతీయ రహదారి విస్తరణకు మాత్రమే మట్టి టిప్పర్లకు అనుమతి… నియోజకవర్గ పరిధి దాటి మట్టి తరలిస్తే సహించేది లేదు..

  • మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని హెచ్చరిక..

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

కైకలూరు నియోజకవర్గం పరిధిలో ట్రాక్టర్లకు మాత్రమే మట్టితోలకాలకు అనుమతిస్తున్నామని టిప్పర్లతో మట్టిని తరలిస్తే సహించేది లేదని కైకలూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు.

శుక్రవారం స్థానిక ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కామినేని మాట్లాడుతూ.. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ని జాతీయ రహదారి విస్తరణ పనులకు మాత్రమే టిప్పర్లతో మట్టి తోలకాలకు అనుమతిస్తామన్నారు. కైకలూరు నియోజకవర్గంలో విచ్చలవిడి మైనింగ్ కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో మట్టి తవ్వకాలకు సంబంధించి కేవలం రైతులు ట్రాక్టర్లతో మాత్రమే రవాణా చేసుకోవాలని, నియోజకవర్గం దాటి వెళ్లరాదన్నారు.

అలాగే, హైవే విస్తరణ పనులకు అగ్రహారం నుంచి అలపాడు వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు మాత్రమే పరిమితికి తగిన బరువుతో మాత్రమే టిప్పర్లతో మట్టి రవాణా చేసుకోవచ్చన్నారు. మట్టి టిప్పర్ల రవాణాతో ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోనీ రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. ఇకపై టిప్పర్లలో భారీ లోడుతో మట్టి రవాణా చేయడానికి వీలు లేదని ఎమ్మెల్యే తెగేసి చెప్పారు. జాతీయ రహదారి పనులకు మినహా బయట ప్రాంతాలకు నియోజకవర్గం నుంచి టిప్పర్లతో మట్టి తోలనివ్వబోమని హెచ్చరించారు.

నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి అభివృద్ధి పనులకు మట్టి రవాణా చేసే టిప్పర్లు తాలూకా నెంబర్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో నమోదు చేయించుకుని ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. బయట ప్రాంతాలకు ట్రాక్టర్లతోగాని, టిప్పర్లతోగాని మట్టి తరలింపును ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

విలేకర్ల సమావేశంలో కైకలూరు రూరల్ సిఐ రవికుమార్, పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు, ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు, మండవల్లి, కలిదిండి, ఎస్ఐలు పాల్గొన్నారు.