- ఏపీలో 3 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం.
- లోక్ సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రమంత్రి.
దిల్లీ / ఏలూరు : THE DESK :
గత ఐదేళ్లలో ఏపీలో ముఖ్యంగా ఏలూరు జిల్లా పరిధిలో ఆసుపత్రుల నిర్మాణం, వర్గోన్నతికి సంబంధించి వివిధ పథకాల కింద ఎన్ని నిధులు కేటాయించారని పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ సమాధానం ఇచ్చారు.

గడచిన ఐదేళ్లలో ఏపీకి ఎన్.హెచ్.ఎం పథకం కింద 6 పీ.హెచ్.సిలు మంజూరు చేయగా 5 పూర్తయ్యాయని, ఏలూరు జిల్లాకు నాలుగు మంజూరు చేయగా పురోగతిలో ఉన్నట్లు, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ వింగ్స్ ఏపీకి 4 మంజూరు చేయగా 3 పూర్తయినట్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏపీకి 2,727, ఏలూరు జిల్లాకు 107 మంజూరు చేయగా పూర్తయినట్లు, 15వ ఆర్థిక సంఘం కింద బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఏపీకి 334 మంజూరు చేయగా 35, ఏలూరు జిల్లాలో 15 మంజూరు చేయగా ఒకటి పూర్తయినట్లు, ఏపీకి 9 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మంజూరు చేసినట్లు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్ మిషన్ కింద ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఏపీకి 26 మంజూరు చేయగా 13 పూర్తయినట్లు, ఏలూరు జిల్లాకు ఒకటి మంజూరు చేసినట్లు, క్రిటికల్ కేర్ బ్లాగ్స్ ఏపీకి 24, ఏలూరు జిల్లాకు ఒకటి మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు.
గత ఐదేళ్లలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఏపీకి PM-ABHIM కింద 1271.8 కోట్లు ఆమోదించినట్లు, 2021-22 నుండి 2025-26 వరకు ఏపీకి FC-XV హెల్త్ గ్రాంట్ కింద మొత్తం రూ. 2600.8 కోట్లు చొప్పున మొత్తం రూ.3872.6 కోట్లు ఆమోదించినట్లు మంత్రి బదులిచ్చారు.
కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద ప్రస్తుతం ఉన్న జిల్లా రిఫరల్ ఆసుపత్రులతో అనుబంధంగా కొత్త వైద్య కళాశాలల స్థాపనకు ఈశాన్య, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 90:10, ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో కేంద్రం అనుమతిస్తుందని, ఈ పథకం కింద ఏపిలో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో మెడికల్ కాలేజీలతో సహా మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదించగా, ఏపీలోని మూడు మెడికల్ కాలేజీలలో పాడేరు, మచిలీపట్నం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.