- ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా బదులిచ్చిన కేంద్ర మంత్రి
దిల్లీ/ ఏలూరు : THE DESK :
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 కేంద్రీయ విద్యాలయాలు, 15 జవహర్ నవోదయ విద్యాలయాలతో సహా దేశవ్యాప్తంగా 1253 కేంద్రీయ విద్యాలయాలు, 653 నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ప్రకటించారు.
కేంద్రీయ విద్యాలయాలు (కెవి), జవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్‌వి) ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్ని పనిచేస్తున్నాయని, కొత్తగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
రక్షణ, పారా-మిలటరీ సిబ్బంది, సెంట్రల్ అటానమస్ బాడీలు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లు (PSUలు), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (IHL)తో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా అవసరాలు తీర్చడానికి కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి బదులిచ్చారు.
నవోదయ విద్యాలయ పథకంలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నామని, వంద శాతం పట్టణ జనాభా ఉన్న ఆరు జిల్లాలు కాకుండా.. ఈ పథకాన్ని ఆమోదించిన రాష్ట్రాలు, అన్ని జిల్లాలు (31.05.2014 నాటికి) ఈ పథకం పరిధిలోకి వచ్చాయని.. కొత్తగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, శాశ్వత భవనాల నిర్మించడానికి అవసరమైన భూమి సేకరణ, తాత్కాలిక అద్దె భవనాలు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సుముఖతపై విద్యాలయ ఏర్పాటు ప్రక్రియ ఆధారపడి ఉంటుందని మంత్రి తెలిపారు.
జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేయలేదని, వాటిలో సెంట్రల్ ఢిల్లీ (NCT ఆఫ్ ఢిల్లీ), న్యూఢిల్లీ (NCT ఆఫ్ ఢిల్లీ), ముంబై (మహారాష్ట్ర), ముంబై సబ్-అర్బన్ (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ), కోల్‌కతాలో (పశ్చిమ బెంగాల్) ఉన్నాయని, తమిళనాడు రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఇంకా నవోదయ విద్యాలయ పథకాన్ని ఆమోదించలేదని మంత్రి పేర్కొన్నారు.