The Desk… Delhi : 24,408 మంది భారతీయులు, విదేశీయులను సురక్షితంగా తరలించాం : సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడి

The Desk… Delhi : 24,408 మంది భారతీయులు, విదేశీయులను సురక్షితంగా తరలించాం : సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడి

  • ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి.

దిల్లీ/ ఏలూరు : THE DESK :

గడిచిన ఐదేళ్లలో ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్, సూడాన్, ఇజ్రాయెల్, హైతీలలో యుద్దాల వల్ల చిక్కుకుపోయిన 24,017 మంది భారతీయులు, 391 మంది విదేశీ పౌరులను మొత్తం 24,408 మందిని సురక్షితంగా తరలించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు.

గత ఐదేళ్లలో వివిధ అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడానికి దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా ఉక్రెయిన్ నుంచి 682 మందిని, ఆపరేషన్ కావేరీలో భాగంగా సుడాన్ నుంచి106 మందిని, ఆపరేషన్ అజయ్ లో భాగంగా ఇజ్రాయిల్ నుంచి 45 మందిని ఏపీకి చెందిన మొత్తం 833 మందిని సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు మంత్రి బదులిచ్చారు.

యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి 2021 నుంచి ఇప్పటి వరకు రూ.181.46 కోట్లు ఖర్చు చేశామని, విదేశాలలో ఉన్న భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తరలించడానికి భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతుందని మంత్రి తెలిపారు.

గత ఐదేళ్లలో అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల్లో అనవసరమైన ప్రయాణాలను నివారించేందుకు భద్రతా మార్గదర్శకాల మేరకు భారతీయులను హెచ్చరించడానికి, ముఖ్యంగా అస్థిర ప్రాంతాలలో పరిణామాలకు అవసరమైన విధంగా ప్రభుత్వం సలహాలను జారీ చేస్తుందని, విదేశాలలో ఉన్న భారతీయులు ఎప్పటికప్పుడు సంప్రదించడానికి వీలుగా భారతీయ మిషన్లు హెల్ప్ లైన్ నెంబర్లు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.