The Desk…Kaikaluru : వైకాపా కు జయమంగళ షాక్… పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..!!

The Desk…Kaikaluru : వైకాపా కు జయమంగళ షాక్… పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..!!

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

కైకలూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ శనివారం తన పదవికి రాజీనామా చేశారు.

ఈ మేరకు మండలంలోని ఆటపాకలో గల తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జయమంగళ వెంకటరమణ (జెవిఆర్) ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీకి గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు.

ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను ఉదయం భీమవరం వెళ్లి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజుకు అందించినట్లు ఆయన తెలిపారు.

వ్యక్తిగత కారణాలవల్లే తాను పార్టీకి పదవికి రాజీనామా చేసినట్లుగా చెప్పారు. పార్టీ అధికారంలో ఉండి…తాను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయలేకపోయానని ఆయన వాపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.

గతంలో తెదేపాలో కొనసాగిన జయమంగళ వెంకటరమణ.. 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైకాపాలో చేరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

అయితే, సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత పార్టీతో ఆయన అంటీముట్టనట్లు ఉన్నారు. ఈ క్రమంలో జయమంగళ వెంకటరమణ తన పదవికి, వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే భవిష్యత్తు ప్రణాళికపై తన సన్నిహితులు, అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయమై మీడియా ప్రతినిధులు జయమంగళను అడుగగా.. అభిమానులు, సన్నిహితులతో చర్చించి తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.