- వచ్చే వారంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న సీఎం చంద్రబాబు..
- పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
- జీలుగుమిల్లి మండలంలోని ఆయుధ కర్మాగారం ఏర్పాటు..
– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా పూర్తి చేసేది సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటిస్తారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ… వచ్చే వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారని ఎంపీ తెలిపారు.
అధికారులు, తాను ఎప్పుడు పర్యటనకు వెళ్లినా పోలవరం నిర్వాసితుల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయని ఎంపీ స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి పోలవరం నిర్వాసితులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాలనే విషయంపై ప్రణాళిక సిద్ధం చేస్తారని ఎంపీ తెలిపారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం కల్పించాల్సిన ప్రయోజనాలపై వచ్చేవారంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదిక సమర్పిస్తున్నట్లు ఎంపీ హామీ ఇచ్చారు.
అలాగే ఆయుధ కర్మాగారం జీలుగుమిల్లి మండలంలోనే ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు తమకు పూర్తిగా సహకారం అందించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఆయుధ కర్మాగారం ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఎంపీ సూచించారు.
జిల్లా కేంద్రమైన ఏలూరులో ట్రేడింగ్ కు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారని, జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పరిశ్రమ పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేస్తామని ఎంపీ శుభవార్త చెప్పారు.
ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి సహకరించాలని ఇటీవల తాను కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని, భవిష్యత్తులో ఆ పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో పారిశ్రామికవాడగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ శక్తివంచ లేకుండా కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగా 65 వేల కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని ఎంపీ తెలిపారు.
ఈ పరిశ్రమ ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. లక్ష కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయని ఎంపీ తెలిపారు.
పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి ఒక్కో పార్లమెంటుకు 100 కోట్లు కేటాయించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలత వ్యక్తం చేశారని ఎంపీ స్పష్టం చేశారు. పీపీపీ విధంగా రహదారులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, తద్వారా భవిష్యత్తులో అధ్వానంగా ఉన్న రహదారులు నూతన శోభను సంతరించుకుంటాయని ఎంపీ వెల్లడించారు.
ఈనెల 25 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏలూరు నియోజకవర్గం పరిధిలోని రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని రంగాలు చెందిన ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి అవసరమైన నిధులు రాబట్టేందుకు పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వీలుగా నివేదిక సిద్ధం చేసుకున్నట్లు ఎంపీ తెలిపారు.
జాతీయ రహదారులు, రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. జల్ శక్తి మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిన పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.