కృష్ణా జిల్లా : ఘంటశాల : THE DESK :
విద్యార్థులు సమయపాలన పాటిస్తూ పట్టుదల అంకితభావంతో ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని చదువులో మంచి ఫలితాలు సాధిస్తూ సమాజంలో గుర్తింపు పొందాలని ఎస్ఐ కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు.
ఆదివారం ఘంటసాల గ్రంధాలయంలో గ్రంథాలయ అధికారి ఎం. శరత్ కుమార్ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఎస్ఐ ప్రతాప్ రెడ్డి పలు అంశాలపై సమగ్రంగా వివరించారు.
ఎస్సై ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ…
విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణతో ప్రతిక్షణం చదువుపై శ్రద్ధ వహించి వృద్ధిలోకి రావడం ద్వారా తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. దిశ ఫోక్సో చట్టం, తదితర చట్టాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, తదితర పోటీ పరీక్షల్లో విజేత లైన వారి ఇంటర్వ్యూలను శ్రద్ధతో చదివి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆదివారం వంటి సెలవు రోజులలో గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు.
విద్యార్థులు ఫేస్ బుక్ ,వాట్సప్, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వంటి వాటి ద్వారా కాలక్షేపం చేయకూడదని, సాంకేతిక అంశాలపై చదువుకు ఉపయోగపడే అంశాలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఎస్ఐ ప్రతాప్ రెడ్డిని గ్రంథాలయ అధికారి ఎం .శరత్ కుమార్ శాలువాతో ఘనంగా సత్కరించారు.
విద్యార్థినీ విద్యార్థులకు ‘వాతావరణం మార్పులు మరియు నష్టాలు’ అంశంపై వ్యాసరచన పోటీలు జరిపారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎం శరత్ కుమార్, స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు శివ నాగలక్ష్మి, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.