కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK :
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ లో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి ఆర్. గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలిసి దుస్తులు మార్చుకొను గదులు, రేఖా చిత్రపటంలో వివిధ విభాగాల ప్రదేశాలను తదితర కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అక్కడే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ… ఈనెల 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్‌కు ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు వస్తారని వారికి కావలసిన ఏర్పాట్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వేడివేడి పాలు పంపిణీ చేయడంతో పాటు వారు తప్పిపోకుండా చేతికి టాకింగ్ వేయాలన్నారు.
అలాగే వివిధ దేవస్థానాల నుండి కావలసినంత ప్రసాదాలు తెప్పించాలని, ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేయుటకు విడివిడిగా విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ కూడా ప్రజలు తొక్కిసలాట జరగకుండా రహదారికి దూరంగా, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయా విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాల వద్ద చెత్త కుండీలు ఏర్పాటు చేసి నిండిన వెంటనే ఎప్పటికప్పుడు కుండీలను మార్చి చెత్తను దూర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు.పారిశుధ్య సిబ్బందిని, కార్మికులను నియమించుకొని నిరంతరం బీచ్ లో ఎక్కడ చెత్తాచెదారాలు లేకుండా శుభ్రంగా ఉంచేలా ఏర్పాటు చేయాలన్నారు.
ఎక్కడ ఏమి విభాగాలు ఉన్నాయో వివరించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెత్తను చెత్తకుండీలలో వేసే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సముద్ర స్నానాలు చేస్తున్నవారు ఎక్కువమంది ఉండే పక్షంలో కొత్తగా వచ్చే వారిని ఏదైనా ఒక ప్రదేశంలో నిలుపుదల చేసి సముద్రం దగ్గర తొక్కిసులాట జరగకుండా రద్దీ తగ్గిన తర్వాత వారిని పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు.
సముద్రంలో లో టైడ్, హై టైడ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎర్రటి జెండాలతో గుంజలు నాటి తాళ్లతో కట్టి పక్కాగా. బారికేడింగ్ చేయాలని, వాటిని దాటి ప్రజలు ఎవరు సముద్రం లోపలికి పోకుండా పోలీసులు, గజఈతగాళ్లు అందరూ ఒకచోట కాకుండా కొద్దికొద్ది దూరంలో ఉంటూ పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి పోలీసులు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. లైఫ్ జాకెట్లు, లైవ్ బాయిలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ప్రజలను అనుమతించిన ప్రదేశం వరకు తప్పనిసరిగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని వాటిని దాటిపోకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచాలన్నారు ఒక పోలీస్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రోన్ ద్వారా దృశ్యాలు చిత్రీకరిస్తూ ఫాల్కన్ వాహనానికి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడ రద్దీ లేకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, హైమాస్ విద్యుత్ దీపాలు, జనరేటర్లతో పాటు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.
ఈ కార్తీక పౌర్ణమి ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఎవరికీ ఎలాంటి సెలవులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణకు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ గైడ్స్ వంటి స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలను తీసుకోవాలన్నారు.రహదారిలో ఏమైనా వాహనాలు ఇరుక్కునిపోయి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితిలో అవాంతరాలు లేకుండా దాన్ని తొలగించేందుకు క్రేన్లు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీచ్ కు వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఏమైనా ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదురైతే మందులు అందజేసి చికిత్స చేయాలన్నారు.వాహనాలను అన్నింటిని పార్కింగ్ ప్రదేశంలో నిలుపుదల చేసి అక్కడి నుండి ప్రజలు కాలినడకన బీచ్‌కు చేరుకునేలా చూడాలన్నారుపోలీసు అవుట్ పోస్టు వద్ద అధికారుల వాహనాలు నిలుపుకొనుటకు ఏర్పాటు చేయాలన్నారు.
పారిశుధ్య కార్మికులకు ఇతరత్రా విధులు నిర్వహించే ఉద్యోగులకు వేరుగా ఆహారం అందించే ఏర్పాటు చూడాలన్నారు విధులు నిర్వహించే వారికి, వాహనాలకు పాసులు జారీ చేయాలన్నారు.బీచ్ కు వచ్చే రహదారి మార్గంలో ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లు కొంతవరకు తొలగించారని ఇంకా పూర్తి స్థాయిలో అంతా తొలగించి చదును చేయాలన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే హారతి ఇచ్చే కార్యక్రమానికి తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు కూడ పక్కాగా చేయాలని కలెక్టర్ సూచించారు.ప్రజల అవసరాలను బట్టి బీచ్ కు వెళ్లేందుకు ఈనెల 14 నుండి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని 15వ తేదీన ఉదయం 3 గంటల నుండి ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు.
కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి, డిపిఓ జే అరుణ, డిపిటీవో వాణిశ్రీ, ఆర్టీసీ డిఎం పెద్దిరాజు, దేవాదాయ శాఖ ఏసి సాంబశివరావు, డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేష్,పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణరావు, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, ఐ సి డి ఎస్ పి డి సువర్ణ,డిఎస్పి అబ్దుల్ సుభాని,అగ్నిమాపక అధికారి ఏసురత్నం, మెరైన్ ఎస్ఐ జగదీష్ చంద్రబోస్, ఎంవిఏ శ్రీనివాసు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.