గుంటూరు జిల్లా : మంగళగిరి : THE DESK :
ప్రఖ్యాత విలువిద్య క్రీడాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖ శుక్రవారం ఉదయం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేఎల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన జ్యోతి సురేఖ స్వగ్రామం చెరుకుపల్లి మండలం నడింపల్లి. తల్లిదండ్రులు శ్రీ దుర్గ, సురేంద్ర కుమార్. చిన్నారి జ్యోతి సురేఖ భవిష్యత్తు కోసం విజయవాడలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఈతలో ప్రావీణ్యం సాధించిన జ్యోతి సురేఖ నాలుగేళ్ల వయసులో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు లిఖించుకుంది.
తదుపరి విలువిద్య పై దృష్టి సారించి 13 ఏళ్ల వయసులో తొలిసారి అంతర్జాతీయ వేదికపై జ్యోతి సురేఖ మెరిసింది. ఇక నాటి నుంచి వెనుతిరగని జ్యోతి సురేఖ ప్రపంచస్థాయి పోటీల్లో అనేక బహుమతులను కైవసంచేసుకుంది.
ఆర్చరీ క్రీడాకారిణిగా ప్రసిద్ధిగాంచిన జ్యోతి సురేఖ మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కేఎల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించడంతో పాటు అనేక పోటీల్లో పాల్గొని ప్రసిద్ధిగాంచింది.
క్రీడారంగంలో ప్రత్యేకించి ఆర్చరీలో అత్యున్నత స్థాయికి ఎదిగిన జ్యోతి సురేఖకు గత ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ తో సమానమైన గ్రూప్ వన్ పోస్టింగ్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా శుక్రవారం విజయవాడలో స్టేట్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు తమ ఇష్ట దైవమైన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో సహా దైవదర్శనం చేసుకున్నారు.