THE DESK NEWS:
జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరుతారు. ఇప్పటికే వీరు ముగ్గురూ వేర్వేరుగా శ్రీ పవన్ కల్యాణ్ గారితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు.
అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు శ్రీ అవనపు విక్రమ్, డా.అవనపు భావన జనసేనలో చేరతారు. వైసీపీ యూత్ జోనల్ ఇంఛార్జ్ గా శ్రీ అవనపు విక్రమ్ ఉన్నారు. డా. భావన విజయనగరం, పార్వతీపురం జిల్లాల డి.సి.ఎం.ఎస్. చైర్ పర్సన్ గా ఉన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన డా.యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్.పి.టి.సి. డా.యాదాల రత్నభారతి పార్టీలో చేరనున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన కండువా వేసుకొంటారు.
శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారితో శ్రీ కిలారి రోశయ్య, శ్రీ కంది రవిశంకర్ సమావేశమయ్యారు. ఆనంతరం శ్రీ సామినేని ఉదయభాను భేటీ అయ్యారు.