The Desk…INTERNATIONAL : టైటానిక్ ఎప్పుడు అదృశ్యం అవుతుందో తెలుసా…?

The Desk…INTERNATIONAL : టైటానిక్ ఎప్పుడు అదృశ్యం అవుతుందో తెలుసా…?

THE DESK : టైటానిక్ :

సముద్రం అడుగున ఈ ఓడను తినేస్తున్న జీవులు ఏంటి, ఎన్నాళ్లకు ఇది అదృశ్యమవుతుంది..❓

ఆర్ఎంఎస్ టైటానిక్. 112 సంవత్సరాలకు పైగా ఉత్తర అట్లాంటిక్ సముద్రపు అడుగున పడి ఉందీ ఓడ. 1912 ఏప్రిల్‌లో ఈ నౌక మునిగిపోతూ విరిగిపోయి అడుగుకు చేరింది.

దీని శిథిలాలు కొన్ని చెల్లాచెదురయ్యాయి. సముద్రం అట్టడుగున అంటే ఉపరితలం నుంచి దాదాపు 3.8 కిలోమీటర్ల లోతున శిథిల టైటానిక్ నిలిచి ఉంది. అప్పటి ప్రమాదంలో ఓడలోని 1,500 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.

అప్పుడప్పుడు జలాంతర్గాములు, టైటానిక్‌లోని చిన్నచిన్న వస్తువులను, కళాఖండాలను పైకి తీసుకొచ్చే ప్రయోగవాహనాలు ఆ శిథిలాల దగ్గరకు వెళ్లి వస్తుంటాయి. అయితే, టైటానిక్ ఓడ శిథిలాలు నెమ్మదిగా క్షీణించిపోతున్నాయని తాజా పరిశీలనలో తేలింది.

ఇటీవల టైటానిక్‌ దగ్గరకు వెళ్లివచ్చిన ఓ ప్రయోగవాహనం తీసిన చిత్రాలు ఆ నౌక క్రమంగా శిథిలమవుతున్న విషయాన్ని వెల్లడించాయి.

1985లో టైటానిక్ శిథిలాలను గుర్తించినప్పుడు తీసిన ఓడ ముందు భాగం, రెయిలింగ్‌‌‌‌ల ఫోటోలు పాపులర్ అయ్యాయి. కానీ, 2022లో ఆ శిథిలాలను స్కాన్ చేసినప్పుడు, ఆ రెయిలింగ్ వంగిపోతుండటాన్ని గమనించారు.

2024 నాటికి టైటానిక్‌లోని ఒక ముఖ్యమైన భాగం విరిగిపోయి దూరంగా పడినట్లు తాజాగా గుర్తించారు. సముద్రం అడుగున ఉన్న వాతావరణం టైటానిక్‌పై ప్రభావం చూపుతోందనడానికి, నౌక క్రమంగా విచ్ఛిన్నం అవుతోందనడానికి ఈ మార్పులు ఒక ఉదాహరణ.

టైటానిక్ పైనున్న సముద్రపు పీడనం, నీటి అడుగుభాగంలో ప్రవాహాలు, ఇనుమును తినే బ్యాక్టీరియా… ఇవన్నీ ఓడ క్రమంగా శిథిలమై కనిపించకుండా పోవడానికి కారణమవుతున్నాయి. టైటానిక్‌పై ఒత్తిడి టైటానిక్ మునిగిపోతూ, రెండు భాగాలుగా విడిపోయింది.

ఆ రెండు ముక్కలు సముద్రపు అడుగున ఒకదానికొకటి దాదాపు 600 మీటర్ల దూరంలో పడిపోయాయి. బాగా బలంగా ఉండే ఓడ వెనక భాగం వేగంగా మునిగిపోగా, ముందు భాగం కాస్త ఆలస్యంగా సముద్రం అడుగుభాగానికి చేరింది. మునిగే సమయంలో నౌకకు సంబంధించి వివిధ పరికరాలు, వస్తువులు, అందులో ఉన్న బొగ్గు.. దాదాపు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడ్డాయి.

ఓడ మంచుకొండను ఢీకొన్నప్పుడు, దాదాపు 43,000 టన్నుల నీరు ముందు భాగంలోకి వచ్చింది. వెనుక భాగం విడిపోయినప్పుడు, దానిలో అప్పటికే గాలి నిండిన కంపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి.

సముద్రపు అడుగుభాగానికి చేరుతున్నప్పుడు పెరుగుతున్న నీటి ఒత్తిడి కారణంగా ఆ కంపార్ట్‌మెంట్‌లు బద్దలై, లోహపు వస్తువులు, విగ్రహాలు, ప్రయాణికుల సామాన్లు చెల్లాచెదురైపోయాయి.అయితే, ఓడ బరువే అది విచ్ఛిన్నం కావడంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది.

52,000 టన్నుల ఉక్కు, సముద్రపు అడుగుభాగంలో స్థిరపడటంతో, ఓడ ఫ్రేమ్ మీద ఒక బలమైన శక్తి (ట్విస్టింగ్ ఫోర్స్) పని చేస్తోంది. ప్రయోగవాహనాలను పంపి పలుమార్లు సేకరించిన ఫుటేజీ ద్వారా ఈ విషయం తెలిసింది. దాని స్టీల్ ప్లేట్లలో పెద్దపెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. ‘‘టైటానిక్ శిథిలాల రూపు క్రమక్రమంగా మారుతోంది.

ఇది ఒకరకంగా దుర్వార్త’’ అని శాస్త్రవేత్త గెర్హార్డ్ సీఫెర్ట్ అన్నారు. ఆయన 2022లో డీప్-సీ మ్యాపింగ్ చేసే మాజిలాన్ కంపెనీ తరపున, టైటానిక్ శిథిలాలను హై-రిజల్యూషన్ స్కానింగ్ చేసే ప్రోగ్రామ్‌కు నేతృత్వం వహించారు.

ఉక్కు ప్లేట్లు, దూలాలు, ఇతర బరువు మోసే వస్తువులు తుప్పు కారణంగా సన్నబడిపోతున్నాయని, ఓడ నిర్మాణాన్ని ఈ తుప్పు క్రమంగా బలహీనపరుస్తోందని సీఫెర్ట్ చెప్పారు.

తినేస్తున్న బ్యాక్టీరియా అన్ని ఉక్కు నిర్మాణాలలాగే టైటానిక్ కూడా తుప్పుపట్టింది. కానీ 3.8 కిలోమీటర్ల లోతున, ఐరన్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసే రసాయన చర్య, భూమి మీద జరిగే ప్రక్రియ కంటే భిన్నంగా ఉంటుంది.

టైటానిక్‌లో చాలా తుప్పు బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతోంది. టైటానిక్‌ శిథిలాలపై బ్యాక్టీరియా, సముద్రపు శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులు ఉన్న ఒక బయోఫిల్మ్‌ ఏర్పడింది. ఈ బయోఫిల్మ్ ఓడ శిథిలాలను ఆహారంగా చేసుకుని పెరుగుతోంది.

మొదట్లో సేంద్రియ పదార్థాలైన దిండ్లు, తువ్వాళ్లు, ఫర్నీచర్‌‌ లాంటివి సముద్రపు లోతుల్లోని సూక్ష్మజీవులకు సమృద్ధిగా పోషకాలను అందించడంతో అవి ఇక్కడ స్థిరపడ్డాయి. కాలక్రమేణా, ఇతర మైక్రోబ్స్ ‌కూడా దీనిపై ఆధారపడడం మొదలుపెట్టాయి.

యాసిడ్‌ను ఉత్పత్తి చేసే ఇతర బ్యాక్టీరియాతో పాటు, ఇనుమును ఆక్సీకరణం చేసే బ్యాక్టీరియా… లోహంతో తయారైన ఓడ ఉపరితలాలను తినేస్తోంది. పరిశోధకులు శిథిలాల మీద ఒక కొత్త జాతి బ్యాక్టీరియాను కూడా గుర్తించారు.

‘హాలోమోనాస్ టైటానికే’ అని ఈ బ్యాక్టీరియాకు పేరు పెట్టారు. ఇందులో ఇనుమును విచ్ఛిన్నం చేసే జీన్స్ ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. సల్ఫర్‌ను పరివర్తనం చేసే బ్యాక్టీరియా కూడా ఆక్సిజన్ లేని ప్రాంతాలలోకి చొరబడింది.

దీని కారణంగా ఓడ ఫ్రేమ్‌లో పగుళ్లు వచ్చాయి. ఇవి సల్ఫర్‌ను ఉత్పత్తి చేస్తే, అది సముద్రపు నీటిలో సల్ఫ్యూరిక్ యాసిడ్‌గా మారి, ఓడలోని లోహాన్ని తినేస్తోంది. దీనివల్ల ఇతర సూక్ష్మజీవులు తినదగిన ఇనుము బయటపడుతోంది.

ఓడ పడిపోవడంలో వెనుక భాగం ఎక్కువ నష్టపోయిందని, ఇది ముందు భాగం కంటే 40 సంవత్సరాలు వేగంగా క్షీణించిందని ఈస్ట్రన్ ఫ్లోరిడా స్టేట్ కాలేజీలో మైక్రోబయాలజిస్ట్‌గా పని చేస్తున్న ఆంథోనీ ఎల్-ఖౌరీ అన్నారు.

ఆయన టైటానిక్ చిత్ర దర్శకుడు, డీప్-ఓషన్ ఎక్స్‌ప్లోరర్ జేమ్స్ కామెరాన్‌తో కలిసి ‘టైటానిక్ క్షీణతకు సూక్ష్మజీవులు ఎలా దోహదం చేస్తున్నాయి’ అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు.

కామెరాన్ 2005లో టైటానిక్ శిథిలాల దగ్గరకు వెళ్లినప్పుడు టైటానిక్‌లోని టర్కిష్ బాత్‌టబ్‌లలో ‘రస్ట్‌ఫ్లవర్స్’ అనే పేరుతో తీగల రూపంలో ఉన్న తుప్పును గుర్తించారు. అలాగే టేకు, మహోగనీ( దేవదారు) కలపతో చేసిన వస్తువులు ఏమాత్రం చెదిరిపోకుండా ఉన్నాయని కూడా గుర్తించారు.

ఇది అసాధారణమైన విషయం. దీనికి కారణం ఆ స్నానపు తొట్లు ఓడ లోపలి భాగంలో, ఆక్సిజన్ అందని ప్రాంతంలో ఉన్నాయి. అందువల్ల కలపను దెబ్బతీసే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు అక్కడికి చేరలేకపోయాయి.కానీ, దానికి బదులుగా 5 అడుగుల మేర చెట్ల కొమ్మల మాదిరిగా బాత్‌టబ్‌లపై తుప్పు ఏర్పడింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ‘రస్ట్‌ఫ్లవర్‌’లు భూ అయస్కాంత రేఖలను అనుసరించి ఒకే దిశలో ఉన్నట్లు కూడా గుర్తించారు.ఇవి తుప్పును ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా, శిథిలాలపై నివసించే ‘మాగ్నెటోటాక్టిక్’ బ్యాక్టీరియా కాలనీల ద్వారా ఏర్పడినట్లు సూచించే ఆధారాలను ఎల్-ఖౌరీ, కామెరాన్ టీమ్ కనుగొంది.

ఈ బ్యాక్టీరియా కాలనీలు టైటానిక్‌ ఉక్కును తినుకుంటూ వెళుతూ, భూ అయస్కాంత క్షేత్ర రేఖల దిశలో నిలబడి కనిపించే తుప్పును ఏర్పరుస్తాయని ఎల్-ఖౌరీ వివరించారు.అపారమైన ఉక్కు భోజనంటైటానిక్ కారణంగా సముద్రపు అడుగుభాగంలో విస్తారమైన ఇనుముతో కూడిన అసాధారణ పర్యావరణ వ్యవస్థ ఏర్పడింది.

ఇది క్షీణించినప్పుడు, ఇనుప కణాలు నీళ్లలో కరిగి, కీలకమైన పోషకాలతో దానిని నింపుతాయి.సాధారణంగా సముద్రగర్భంలోని అగ్నిపర్వత హైడ్రోథర్మల్ కుహరాలు ఇనుముకు ముఖ్యమైన సోర్స్. అది అనేక జీవులకు పోషకం. ఇక్కడ ఇతర జీవులకు ఇనుమును అందించడంలో బ్యాక్టీరియా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

‘‘టైటానిక్ శిథిలాలు సముద్రపు అడుగు భాగంలో ఒక ఇనుప ఒయాసిస్‌లా పని చేస్తున్నాయి’’ అని ఎల్-ఖౌరీ చెప్పారు.

‘‘ఈ ఒయాసిస్ కీలకమైన పోషకాన్ని అందిస్తూ, స్టార్ ఫిష్, ఎనిమోన్స్, గ్లాస్ స్పాంజ్‌లు, బెంథిక్ పగడాలకు నిలయమైన సముద్రపు దిబ్బకు ఉపయోగపడుతోంది. అలాగే ఇది ఐరన్ బ్యాక్టీరియాకు నిలయంగా ఉంది’’ అని ఆయన వివరించారు.టైటానిక్ ఇనుము సముద్రపు అడుగుభాగంపైనా ప్రభావం చూపుతోంది.

దీని శిథిలాల నుంచి సంవత్సరానికి 10 సెంటీమీటర్ల చొప్పున తుప్పు వ్యాపిస్తోంది.మొత్తంగా, టైటానిక్ ప్రతిరోజూ 0.13 నుంచి 0.2 టన్నుల ఇనుమును కోల్పోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 280 నుంచి 420 సంవత్సరాలలో ఓడ ముందుభాగంలోని ఇనుము పూర్తిగా కరిగిపోతుందని భావిస్తున్నారు.

సముద్రపు అడుగుభాగంలో ప్రవాహాలుసముద్ర పైభాగంలో నీటి ప్రవాహాలు(కరెంట్స్) ఉన్నట్లే, సముద్రం లోపలా అలాంటి ప్రవాహాలు ఉంటాయి. ఉపరితల గాలులు, లోతైన నీటి అలలు లేదా ఉష్ణోగ్రత, లవణీయత వల్ల నీటి సాంద్రతలో కలిగే వ్యత్యాసాలు వీటిపై ప్రభావం చూపుతాయి. వీటిని ‘థర్మోహాలైన్ ప్రవాహాలు’ అంటారు.

టైటానిక్ చుట్టూ సముద్రగర్భంలో ఉన్న అవక్షేప నమూనాలపై పరిశోధనలో, సముద్రగర్భ ప్రవాహాలు ఓడను ఢీకొంటూ ఎలా దెబ్బతీస్తున్నాయో వెల్లడైంది. టైటానిక్ శిథిలాల తూర్పు అంచున ఉన్న ఇసుక అలలు, ఇక్కడ పశ్చిమ దిశలో ప్రవాహాలు ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఈ ప్రవాహాలు బలమైనవి కాకున్నా, శిథిలాలు బాగా బలహీనపడినప్పుడు అవి విచ్ఛిన్నమవడానికి కారణమవుతాయి.

అయితే ఈ ప్రవాహాలు, పూర్తిగా ధ్వంసం కాకముందే టైటానిక్‌ను సముద్రపు అడుగు భాగంలో కూరుకుపోయేలా చేసే అవకాశం కూడా ఉంది.‘‘శిథిలాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రాండ్ స్టెయిర్‌కేస్ ఫోయర్, మార్కోని రూమ్, ఆఫీసర్స్ క్వార్టర్స్ లాంటివి, 2100 సంవత్సరానికి అదృశ్యమవుతాయని నా అంచనా’’ అని ఎల్-ఖౌరీ చెప్పారు.

‘‘పడవ డెక్‌పై ఉన్న రెయిలింగ్‌లు, డెక్ హౌస్‌లాంటి పలుచని ఉక్కు ముందుగానే అదృశ్యమవుతుంది. అయితే ఈ స్థాయిలో క్షీణించినా, శిథిలాలు పూర్తిగా అదృశ్యం కావడానికి అనేక శతాబ్దాలు పడుతుంది.” అన్నారు ఎల్-ఖౌరీ.