ఏలూరు జిల్లా : కుక్కునూరు : THE DESK :
గ్రామాలలో ప్రజలు అంటువ్యాధులకు గురికాకుండా చర్యలు..
త్రాగునీరుగా శుద్ధ జలాలు అందించడమే లక్ష్యం..
భారీ వర్షాల కారణంగా జిల్లాలో అనేక గ్రామాలు నీటమునిగి బురదమయం అవ్వడంతో జిల్లా వ్యాప్తంగా రెండు వారాలపాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.
భారీ వర్షాల కారణంగా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామాలలో పంచాయతీ సిబ్బంది ఏవిధంగా పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నారో పరిశీలించడానికి మంగళవారం ఆకస్మికంగా కుక్కునూరు మండలం వచ్చారు. సందర్బంగా గ్రామంలో అనేక ప్రాంతాలు సందర్శించిన డీపీఓ త్రాగునీటి స్కీంని పరిశీలించి దగ్గిరలో ఉన్న ప్రధాన వాల్వ్ ఛాంబర్ తనిఖీ చేసారు.
చుట్టుప్రక్క ప్రాంతాలను సందర్శించి స్థానికులతో మాట్లాడుతూ ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అలాగే కాచి చలార్చిన నీరు మాత్రమే త్రాగాలని సూచించారు.
ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో 5 వందల 47 గ్రామ పంచాయతీలలో 547 పారిశుధ్య టీంలు వేసి నిరంతరం మురుగునీటి కాల్వలు శుభ్రపర్చడం, చెత్తకుప్పలు తొలగించడం, లోతెట్టు ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని కచ్చా డ్రైన్స్ తీసి తొలగించడం చేస్తున్నామని అన్నారు.
అన్ని గ్రామ పంచాయతీలలో పదిహేనవ ఆర్ధిక సంఘం నిధులున్నాయని, తగినన్ని శానిటేషన్ మెటీరియల్స్ సిద్ధం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్సులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది పట్ల చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కమీషనర్ పంచాయతీ రాజ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి వెంకట ప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి రాజావుల్లా, విస్తరణ అధికారి నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి మోహనరావు తదితరులు పాల్గొన్నారు