The Desk… Kadiyam : ఇంటిపై – ఒంటిపై చెక్కుడు

The Desk… Kadiyam : ఇంటిపై – ఒంటిపై చెక్కుడు

తూ.గో జిల్లా : కడియం మండలం : వేమగిరి : THE DESK :

ఇంటిపై – చేతి ఉంగరం పై… లారీ నెంబర్

గోదారోళ్ల అభిమానం..

గోదారోళ్ళు ఏం చేసినా ఎటకారంగానే ఉంటుంది. అందులో బోలెడంత మమకారం కూడా ఉంటుంది. అలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసాము.అలాంటిదే ఈ లారీ అభిమాని ఉదంతం. మనం కొత్తగా ఇల్లు నిర్మించుకుని ఆ ఇంటిపై ఇష్ట దైవం పేరు చెక్కించుకుంటాము. మరికొందరు కుటుంబ సభ్యులు పేర్లు చెక్కించుకుంటారు. కాని ఈయన తన ఇంటిపై లారీ నెంబరు చెక్కించారు. అదేదో సరదాగా చెక్కించింది కాదు. మనసు నిండా అభిమానంతో చేయించినది. ఈ ఒక్క ఉదాహరణ చెబితే మీరు నమ్మకపోవచ్చు.పోని ఇంకో సంఘటన చూద్దాం.. మనం చేతి ఉంగరాన్ని అదృష్టం కలిసి రావాలని రకరకాల రంగురాళ్లతో తయారు చేయించుకుంటాము.లేదా ఇష్ట దైవం ఫోటోలతో ఉంగరాలను తయారు చేయించుకుని పెట్టుకుంటారు. కాని ఈయన తన ఉంగరాన్ని కూడా ఆ లారీ నెంబర్ తోనే చేయించుకున్నాడు అంటే తనకున్న అభిమానం ఏపాటిదో స్పష్టమవుతుంది.
సరే అసలు ఆ లారీ కధేంటో.. ఆ అభిమానమేంటో తెలుసుకుందాం.తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన తుమ్మా శ్రీనివాసరావు అనే యువకుడు తాపీ పని చేస్తూ ఉండేవాడు. అయితే తనకు లారీ కొని నడపాలనే ఆశ ఉండేది. వాహనాలు అందరికీ కలిసిరావని తన తండ్రి అభ్యంతరం చెబుతూ వచ్చారు.తండ్రి మరణానంతరం 1999లో లారీని కొనుగోలు చేశారు. తానే డ్రైవరు, ఓనర్ గా ఎంతో జాగ్రత్తగా కిరాయిలకు నడుపుకుంటూ వచ్చారు. ఇతని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ లారీ శ్రీనివాసరావు కు ఆదాయ వనరులు తెచ్చిపెట్టింది. దీంతో ఆ గ్రామ పంచాయతీ సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి 2012 ఇల్లు నిర్మించారు. అలాగే 2022 లో ఆ ఇంటిపై మరో అంతస్తు వేసారు. ఈ లారీ కొనుగోలు చేసి ఇప్పటికి పాతికేళ్లు కావస్తున్నా ఆ లారీని మార్చాలనే ఆలోచన మచ్చుకు కూడా రాలేదు. తనకు చక్కటి ఉపాధి అవకాశం కల్పించిన లారీకి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించుకుంటూ ఎంతో అపురూపంగా చూసుకుంటూ వస్తున్నారు. వేమగిరిలో ఉన్న కోకోకల కంపెనీకి సంబంధించిన కిరాయిలతో పాటు పోలవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి మొక్కజొన్నలు, ధాన్యాన్ని అనపర్తి, మండపేట లకు కిరాయిలకు తోలుతూ ఉంటున్నారు.
1990 మోడల్ లారీని 1999 లో రూ.మూడు లక్షలకు కొనుగోలు చేసారు. ఇప్పుడు అమ్మినా ఆ లారీకి ఇంచుమించు అంతే ధర వస్తుందని శ్రీనివాసరావు తెలుపుతున్నారు.తనకు మద్యం సేవించడం వంటి అలవాట్లు లేవని ఇన్నేళ్లలో చిన్న ప్రమాదం కూడా జరగలేదని తెలిపారు. అందుకునే ఆ లారీ అంటే ప్రాణం అంటున్నారు. ఇంతకీ లారీ నెంబరు చెప్పలేదు కదూ 6116.ఈ నెంబరే తన ఇంటిపై చెక్కించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.శ్రీనివాసరావు కు ఆ లారీపై ఉన్న అభిమాన్ని చూసి అందరూ ఔరా అంటున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా…ఈయన తన ఇంటిపైన,చేతి ఉంగరంపైన లారీ నెంబరు చెక్కించుకోవడమే కాదు సెల్ ఫోన్ నెంబరు కూడా లారీ నెంబరు ఉండేలా 772994 6116 తీసుకున్నారు. ఇప్పటికైనా నమ్ముతారా…గోదారోళ్లు ఏమి చేసినా ఎరయిటీగా అదేనండి వెరైటీగా ఉంటుందని.