ఉప్పుటేరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ —  కొల్లేరు లోతట్టు ప్రాంతాల పరిశీలన

ఉప్పుటేరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ — కొల్లేరు లోతట్టు ప్రాంతాల పరిశీలన

ఏలూరు జిల్లా: కైకలూరు : THE DESK :

ఉప్పుటేరులో వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపుడెక్క, తూడులను యుద్దప్రాతిపదికన శుక్రవారం సాయంత్రంలోగా తొలగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కైకలూరు మండలం సోమేశ్వరం లో శుక్రవారం ఉప్పుటేరులో వరద ఉధృతిని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఇరిగేషన్, రెవిన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. ఉప్పుటేరులో వరద ప్రవాహ స్థితి , గుర్రపుడెక్క ను సుమారు 500 మీటర్ల మేర డ్రోన్ల ద్వారా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. కొల్లేరు నుండి వరద నీరు ఉప్పుటేరు ద్వారా వెళ్లేందుకు గుర్రపుడెక్క అడ్డంకిగా ఉండడంతో వరద నీటి కారణంగా కొల్లేరు ప్రాంతంలోని పలు గ్రామాలలో వరద నీటి ముంపునుండి ఇంకా బయటకు రాలేదన్నారు. గురువారం కొంతమేర గుర్రపుడెక్కను తొలగించినప్పటికీ గుర్రపుడెక్క ఉప్పుటేరు సోమేశ్వరంలోని రైల్వే ట్రాక్ వద్ద నిలబడిపోవడంతో వరదనీటి ప్రవాహం వేగంగా సాగడంలేదన్నారు. దీని కారణంగా కొల్లేరు గ్రామాలలో వరద నీరు తగ్గడం లేదని ఈ దృష్ట్యా అత్యవసరంగా మరిన్ని ప్రొక్లైన్లను ఏర్పాటుచేసి యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్కను తొలగించాలని ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, సమీక్షిస్తున్నారని, ఈ రీత్యా సాయంత్రంలోగా గుర్రపుడెక్కను తొలగించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఎన్ఎస్.కె. ఖాజావలి , ఇరిగేషన్ ఎస్ఈ సిహెచ్ దేవప్రకాష్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా, డిఎస్పీలు డి.శ్రావణ్ కుమార్, జయసూర్య, తహసీల్దార్ ఉదయభాస్కర్, కైకలూరు రూరల్ ఇన్సేక్టర్ బి. కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు.