NTR జిల్లా : విజయవాడ : THE DESK :
విజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టిందెవరు❓
రిటైనింగ్ వాల్ కృష్ణా నది ఎడమ గట్టు వైపు విజయవాడ నగరాన్ని ఆనుకుని రిటైనింగ్ వాల్ నిర్మించింది ఎవరు..❓
ప్రస్తుతం విజయవాడ వరదల చుట్టూ జరుగుతున్న రాజకీయంలో ప్రధాన చర్చ రిటైనింగ్ వాల్‌పైనే. కృష్ణా నది ఎడమ గట్టు వైపు విజయవాడ నగరాన్ని ఆనుకుని నిర్మించిన ఈ పొడవైన గోడ ఎవరు కట్టించారు, దాని ఘనత ఎవరిది అన్న విషయంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
గతంలోనూ ఈ విషయంలో వాదోపవాదాలు జరిగినా తాజా వరదలతో మరోసారి వివాదం రాజుకుంది.
ఇంతకీ ఈ గోడ ఏ ప్రభుత్వ హయాంలో కట్టారు?
రిటైనింగ్ వాల్ ఇక్కడే ఎందుకు?
కృష్ణా నదిపై విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఉంది. వరదల సమయంలో ఆ బ్యారేజి నుంచి నీరు వదిలినప్పుడు, బ్యారేజి దిగువన, నది ఎడమ గట్టును ఆనుకుని ఉన్న విజయవాడ నగర పరిధిలోని ప్రాంతాల్లోకి నీరు చేరుతుంది. ఇళ్లు మునిగిపోయేంత స్థాయిలో ఆ వరద తీవ్రత ఉంటుంది.
కృష్ణ లంక అందులో ప్రధానమైన ప్రాంతం. ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలూ ముంపు ముప్పులో ఉన్నాయి. దీన్ని నివారించడానికి, నది నీరు ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఆపేలా ఒక ఎత్తైన, పొడవైన గోడ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అదే ఈ రిటైనింగ్ వాల్.
సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నీరు ఆ ప్రాంతంలోకి చేరకుండా ఆపేలా గోడ నిర్మించారు.
దీని నిర్మాణం కోసం కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇపుడదే ‘వాల్’ వేలాది కుటుంబాలకు వరద నుంచి రక్షణ ఇచ్చింది.
రాష్ట్ర విభజనకు ముందుఈ గోడ ప్రతిపాదనలు కాంగ్రెస్ హయాంలో మొదలయ్యాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో విజయవాడలోని రామలింగేశ్వర నగర్ నుంచి యనమలకుదురు వరకు 2.7 కిలోమీటర్ల మేర గోడ కట్టడానికి 6 కోట్ల 10 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతి ఇస్తూ జీవో నంబర్: 1060 జారీ చేశారు.
కానీ గోడ కట్టేందుకు వీలుగా ఆక్రమణల తొలగింపు సాధ్యం కాకపోవడంతో పనులు ముందుకు కదల్లేదు.
ఆ తరువాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తమ సొంత నిధులతో ఒక చిన్న గోడ నిర్మాణం తలపెట్టింది.
600 మీటర్ల పొడవైన ఈ గోడ(కార్పొరేషన్ నిధులతో చేపట్టినది) రామలింగేశ్వర నగర్ దగ్గర ఉన్న మున్సిపల్ సీవేజీ ప్లాంట్ రక్షణ కోసం ఉద్దేశించింది.
2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరోసారి రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు కదిలాయి.
ఈ క్రమంలో కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు. విజయవాడ మున్సిపాలిటీ వారు కడుతున్న గోడను కలుపుతూ దానికి రెండు వైపులా మిగిలిన భాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గోడ నిర్మిస్తే సరిపోతుందని లేఖ రాశారు.
దీనిలో 2.1 కి.మీ. పొడవైన గోడను కృష్ణలంక ఫ్లడ్ బ్యాంక్ నుంచి యనమలకుదురు కొండ వరకు ప్రతిపాదించారు.
దీనిని 2013 అక్టోబరులో ఆమోదించి, 104 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత కొద్ది నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తరువాత 2015 జూన్‌లో ఆ కాంట్రాక్టును రెండు ప్రైవేటు సంస్థల (ఎస్ఈడబ్ల్యూ, పీఎంపీఎల్) జాయింట్ వెంచర్ దక్కించుకుంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనేది ఒప్పందం. 40 శాతం పూర్తి చేసిన తర్వాత, 2016 డిసెంబరు నాటికి పనుల్లో కొన్ని డీవియేషన్లు రావడంతో 2017 సెప్టెంబరులో ఆ పనుల అంచనాను రూ.138 కోట్లకు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంజినీర్ల కమిటీ సూచించింది.
2018 జనవరిలో ఆ పనుల అంచనా విలువ రూ.138 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మొత్తం గోడ పనిని మూడు దశలుగా విభజించింది.మూడు దశలు..
మొదటి ఫేజ్: యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు – రూ.165 కోట్ల వ్యయం.
రెండో ఫేజ్: గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు – రూ.126 కోట్ల వ్యయం.
మూడో ఫేజ్: వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు – రూ.110 కోట్ల వ్యయం.
(పైన పేర్కొన్న వ్యయ అంచనాలు 2016 నాటివి)
మొదటి ఫేజ్‌లో గోడ పొడవు అంచనాలు స్వల్పంగా మారుతూ వచ్చాయి.రెండు, మూడు దశలకు సంబంధించి గోడ పొడవు కూడా మారింది.మొత్తంగా ప్రతిపాదనల సమయంలో వివిధ దశల్లోను, నిర్మాణ సమయంలోనూ ఈ గోడ పొడవు మారుతూనే వచ్చింది. వ్యయం కూడా మారుతూ వచ్చింది.
ఎవరు నిర్మించారు?
ఈ గోడలో కొంత భాగం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఇంకొంత భాగం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తయింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పనులు 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి. పూర్తి చేసిన గోడ దూరం 2.47 కిలోమీటర్లు.
ఇది యనమలకుదురులోని శివపార్వతి నగర్ నుంచి గీతానగర్ కట్ట వరకు ఉంది.
మొదటి విడతలో రూ.165 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ తరువాత ఏపీలో ప్రభుత్వం మారింది.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిటైనింగ్ వాల్ రెండు, మూడు దశలు పూర్తి చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో 2020 జనవరిలో రెండో ఫేజ్‌కి జీవో ఇవ్వగా, 2022 సెప్టెంబర్‌లో 1.2 కిలోమీటర్ల గోడ పూర్తయ్యే సరికి రూ.134.43 కోట్లు ఖర్చు అయింది.
ఇక మూడో ఫేజ్ పనుల కోసం 2022 ఆగస్టులో రూ. 235.46 కోట్లకు జీవో ఇచ్చారు. 2024 మార్చికి ఆ పనులు పూర్తి చేశారు. ఈ గోడ పొడవు 1.06 కి.మీ.
‘‘ఫేజ్ వన్ 2.20 కిలోమీటర్ల దూరం టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అందుకోసం రూ.104 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ గోడ పూర్తి కాలేదు. దానివల్ల ఏ ఉపయోగమూ కలగలేదు. పైగా చంద్రబాబు హయాంలో నిధుల కొరత వల్ల పనులు నిలిచాయి. 2019లో ప్రభుత్వం మారాక, జగన్‌మోహన్ రెడ్డి హయాంలో మేం దీన్ని పూర్తి చేశాం. వైసీపీ హయాంలో మొత్తం పూర్తి చేసిన గోడ పొడవు 2.26 కి.మీ. ఖర్చు రూ.369.89 కోట్లు’’ అని వైసీపీ చెబుతోంది.
‘‘రిటైనింగ్ వాల్ టీడీపీ హయాంలోనే సగానికి పైగా పూర్తయింది. 2016లో వీటి అంచనాలు తయారు చేయించారు. గోడ 4.7 కిలోమీటర్లలో మొదటి ఫేజ్ తెలుగుదేశం హయాంలో పూర్తయింది. చంద్రబాబు ఇచ్చిన నిధులతో మొదటి విడత నిర్మించారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చాలాకాలం వరకు పనులు ప్రారంభించకపోవడంతో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. దీంతో పెండింగ్ పనులకు నిధులు ఇచ్చి, రూ.50 కోట్లు నిర్మాణ వ్యయం పెంచి, జగన్ మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు’’ అని తెలుగుదేశం అంటోంది.
కృష్ణలంక రిటైనింగ్ వాల్గోడ పూర్తి లక్ష్యం నెరవేరలేదు:
‘క్రెడిట్ గొడవ పక్కన పెడితే ఆ గోడ పూర్తి లక్ష్యం నెరవేరలేదు. తాజా వరదలకు రాణి గారితోట, తారకరామ నగర్, పోస్టల్ కాలనీ, నేతాజీ నగర్, గీతా నగర్, యనమలకుదురు కొండ వరకు నీళ్లు వచ్చాయి. గోడ కట్టినా నీరు రావడానికి కారణం అవుట్ ఫాల్ డ్రైన్లు. విజయవాడలో మురుగునీటి కాలువలు కృష్ణా నదిలో కలుస్తాయి. కానీ నదిలో వరద వస్తే, ఆ వరద వెనక్కు కాలువల్లోకి వస్తుంది. అలా ఈ ప్రాంతాలు మునిగాయి. కానీ గతంలో అంత తీవ్రత లేదు. గోడ వరద తీవ్రతను బాగా తగ్గించింది కానీ, నీటిని పూర్తిగా ఆపలేకపోయింది. అలా జరగాలంటే ఆ మురుగు కాలువలకు కృష్ణాలో కలిసే చోట గేట్లు ఉండాలి. ఇక గోడ దగ్గర ఉన్న కొన్ని కాలనీల్లో మురుగునీటి కాలువలు ఇంకా ఏర్పాటు చేయలేదు. గతంలో వరద వస్తే ఆ ప్రాంతం వదలి వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు అక్కడి ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్నారు, అంతే తేడా. తీవ్రత తగ్గినా వరద ఆగలేదు’’ అని విజయవాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు తెలిపారు.