🟡 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
గోదావరి పుష్కరాలు– 2027 సందర్భంగా చేపట్టవలసిన పనులను ఈరోజు నుంచి ప్రారంభం చేసినట్లు రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
ఆదివారం రాజమహేంద్రవరం నగరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద రూ.9.55 కోట్ల తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో సంప్రదాయ రీతిలో మంత్రికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ :
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా పరిసర ప్రాంతాల ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణపై ఇప్పటివరకు మూడు రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక సమావేశం, 12 మంత్రులతో సబ్ కమిటీ సమావేశం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో మరో సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాల నిర్వహణలో విశేష అనుభవం కలిగిన నాయకుడని, ఆయన సారథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగు తున్నాయని తెలిపారు.
రాజమహేంద్రవరం నగరంలో రూ.9.55 కోట్ల వ్యయంతో 6 దేవాదాయ సంస్థల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో గుర్తించి అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 43 దేవాలయాల అభివృద్ధి కోసం రూ.51.79 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచినట్లు వెల్లడించారు.
పుష్కరాలు రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు సమగ్రంగా కల్పించనున్నట్లు తెలిపారు.
గోదావరి నది ప్రవహించే 212 కిలోమీటర్ల పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పుష్కర స్నానాలకు అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఈ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 26 నుంచి జూలై 7 వ తేదీ గోదావరి పుష్కరాలు నిర్వహించ నున్నట్లు తెలిపారు.
గోదావరి పుష్కరములు– 2027 సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, ఫేజ్ .1 కింద రాజమహేంద్రవరం నగరంలో 6 దేవాదాయ సంస్థల నూతన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం (పిండప్రదాన భవనం)కు రూ.3 కోట్లు, శ్రీ రమ సత్యనారాయణ స్వామి దేవస్థానం ముఖ మండపం నిర్మాణానికి రూ.1 కోటి, రాజమండ్రి నూనేవర్తకుల అన్నదాన సమాజం అన్నదాన భవనానికి రూ.70 లక్షలు, రామలింగ చౌడేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.55 లక్షలు, గౌతమీ జీవకారుణ్య సంఘం భవనం నిర్మాణానికి రూ.2.80 కోట్లు, శ్రీ చందా సత్రం కళ్యాణ మండపం మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ పనులు పూర్తయిన తరువాత భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించబడటంతో పాటు పుష్కరాల సమయంలో యాత్రికులకు మరింత సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా దేవాలయాల అభివృద్ధి పనులు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం దుశ్శలువాతో సన్మానించారు. దేవాదాయ, పర్యటక శాఖల సమన్వయంతో టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ :
పుష్కరాల నేపథ్యంలో మంత్రి పర్యటన సంతోషదాయకమని పేర్కొన్నారు. స్థానిక దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫేజ్–1 కింద రూ.9.55 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు.
పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ :
గోదావరి పుష్కరాలు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన మహోత్సవమని పేర్కొన్నారు. యాత్రికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దేవాలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ :.
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి మంత్రి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ కె. రామచంద్ర మోహన్, ప్రాంతీయ జాయింట్ కమిషనర్ వి. త్రినాధరావు, రాష్ట్ర స్థాపతి పి. పరమేశ్వరప్ప, కేఆర్ఆర్సి ఎస్డిసి కె. భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శేఖర్, ఎస్.ఈ. దుర్గేష్, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, జిల్లా దేవాదాయ అధికారి ఈ.వి. సుబ్బారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్, ఏఈ కళ్యాణ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కార్యనిర్వహణ అధికారులు విశ్వనాధ్ రాజు, లక్ష్మీబాయి, నాగేశ్వరరావు, తారకేశ్వరరావు, వి. శ్రీదేవి, రమేష్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.

