🔴 నెల్లూరు జిల్లా : నెల్లూరు : ది డెస్క్ :
ఆంధ్రా ప్రాంత మత్స్యకారుల సంరక్షణ కోసం …తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల దాడులనెదుర్కొనేందుకు ఎందాకైనా సిద్ధం
➖మంత్రి ఆనం
రాష్ట్రంలోని తీర ప్రాంత మత్స్యకార సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, శాశ్వత పరిష్కారానికై గట్టి చర్యలకు ఉపక్రమించినట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజితా వేజెండ్ల, శాసనమండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ తదితర నాయకులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మత్స్యకార సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ :
తీర ప్రాంతంలోని మత్స్యకారులకు చిరకాలంగా పోరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరిల తో సమస్యలు ఉన్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మన రాష్ట్ర మత్స్య సంపదను పొరుగు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు హై పవర్ బోట్ల సహాయంతో దోచుకుంటున్న నేపథ్యంలో, ఇతర రాష్ట్రాలకు చెందిన బంధించిన నాలుగు బోట్లను గుర్తు తెలియని వ్యక్తులు విడుదల చేయించిన వైనం జిల్లా మత్స్యకారుల ఆవేదనకు కారణమైందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సముద్ర జలాలపై గస్తీ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుందన్నారు.
ఈ దిశగా వివిధ శాఖల అధికారులు ఇప్పటికే ప్రయోగాత్మకంగా గస్తీ బోటు ను పరీక్షించారన్నారు. మెరైన్ పోలీస్, అటవీ, మత్స్య శాఖ, అగ్నిమాపక శాఖ లకు చెందిన అధికారులతో రెండు బొట్లు 24×7 విధానంలో సముద్రంలో ఏప్రిల్ 14 వరకు గస్తీ తిరుగుతాయన్నారు. ఏప్రిల్ 15 నుండి రెండు నెలలపాటు వేట నిషేధం అమల్లోకి వస్తున్నందున, ఈలోపు మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
అందుకనుగుణంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రస్థాయి ప్రత్యేక బృందం మంగళవారం జిల్లా కు విచ్చేస్తుందన్నారు.
జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక బృందంతో సమావేశమై చర్చించి ప్రభుత్వానికి ఆచరణాత్మక నివేదిక సమర్పిస్తుందన్నారు. జిల్లాలోని మత్స్యకారులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉండే మత్స్యకారులకు తోడుగా ఉంటామని మంత్రి ఆనం ఉద్ధాటించారు. మూడు రాష్ట్రాల చెందిన సమస్య అయినందున కేంద్రానికి సైతం నివేదిక అందించి శాశ్వత పరిష్కారం కొరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నాయకులు గిరిధర్ రెడ్డి, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

