The Desk … Nellore : శ్రీరామనవమి కంటే ముందుగానే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనుల జాతర : మంత్రి ఆనం

The Desk … Nellore : శ్రీరామనవమి కంటే ముందుగానే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనుల జాతర : మంత్రి ఆనం

🔴 నెల్లూరు : ది డెస్క్ :

నెల్లూరు రూరల్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి 240 అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం

స్వశక్తితో ఎదిగిన నాయకుడు కోటంరెడ్డి… కోటంరెడ్డి సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

జనగణన పూర్తయ్యాక మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుగా నెల్లూరు

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లిలో అభివృద్ధి పనుల జాతరను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుల సమష్టి కృషితో రూ.27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి, ఎంపీకి కోటంరెడ్డి సోదరులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.

సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ:

శ్రీరామనవమికి ముందుగానే నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి పనుల జాతర ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. నెల్లూరు రూరల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇది ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన రాపూరు నియోజకవర్గ పరిధిలో భాగమని గుర్తుచేశారు. ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రూరల్ అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు. నగరాభివృద్ధి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమన్వయంతో మేయర్, డిప్యూటీ మేయర్ నిధులను సమీకరించి నగర కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచాలని సూచించారు.

దేవాదాయశాఖ పరంగా రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 29 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతి నెలా ₹10,000 చొప్పున సహాయం అందిస్తున్నామని చెప్పారు. నాలుగు పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ₹10.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా కొత్త ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 5,000 పైగా ఆలయాలను ₹700 కోట్లతో నిర్మిస్తున్నామని వివరించారు. 2027లో గోదావరి, 2028లో కృష్ణ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, పింఛన్లు పెంచి ప్రతి నెల ఇంటికే పంపిస్తున్నామని, “అన్నదాత సుఖీభవ” ద్వారా రైతులకు ఏడాదికి ₹20,000 అందిస్తున్నామని తెలిపారు. “తల్లికి వందనం” పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. పోర్టుల నిర్మాణం ద్వారా మత్స్యకారులను ఆదుకుంటున్నామని, ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.

రైతాంగానికి అండగా జిల్లాలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటికే 18,013 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎంత ధాన్యం ఇచ్చినా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు.

రాష్ట్రంలో జనగణన అనంతరం డీలిమిటేషన్ ప్రకారం అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉందని సూచించారు. కష్టపడి పని చేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

2029 నాటికి తన రాజకీయ ప్రస్థానం 46 సంవత్సరాలు పూర్తవుతుందని, సుదీర్ఘ కాలం పాటు ప్రజల మధ్య గడుపుతూ ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయ జీవితం కొనసాగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంకృషితో ఎదిగిన నాయకుడని, కోటంరెడ్డి సోదరులతో తనకు సోదర భావం ఉందని, వారి భవిష్యత్తుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు.

సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ :

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక శైలి కలిగిన నాయకుడని, అదే శైలితో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశారని ప్రశంసించారు. పడారుపల్లికి రావడం ఆనందంగా ఉందని, రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల వద్ద పెద్ద పరిశ్రమ రానుందని, దాని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ₹613 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో భూగర్భ డ్రైనేజీకి ₹500 కోట్లు, ప్రస్తుతం ₹140 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ :.

రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, “క్వాంటం వ్యాలీ” ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేసిన, టెండర్ దశలో ఉన్న, ప్రారంభించబోయే పనులు కలిపి ₹613 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కొండాయపాలెం గేట్, బీవీనగర్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్‌కు ₹31 కోట్లు మంజూరు చేసినట్లు, త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ అజయ్, నగర మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ భాను శ్రీ, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.