కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
నూతనంగా నిర్మించిన రహదారులు ఎలా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాస్పందన తెలుసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామపంచాయతీ పరిధిలో ఉప్పలూరు నుండి మద్దూరు వరకు 3.50 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన 4.2 కిలోమీటర్ల బి.టి. రహదారిని పరిశీలించి రహదారి ఎలా ఉంది గతంలో ఎలా ఉంది సరిగా నిర్మించారా లేదా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చుట్టుపక్కల గల ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
గతంలో సరైన రహదారి లేక 12 సంవత్సరాలుగా ఇబ్బందులు పడేవారమని, ప్రస్తుతం నూతన రహదారి నిర్మాణం వలన ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరిందని, రహదారి చాలా బాగుందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కంకిపాడు…. కేసరపల్లి రహదారి మార్గంలో 8 లక్షల రూపాయల వ్యయంతో పూడ్చిన గుంతల రహదారిని కూడా పరిశీలించారు. సమీప ప్రాంతంలోని ప్రజల అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంతా సజావుగా ఉందని ప్రజలు కలెక్టర్కు వివరించారు
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట రహదారులు భవనాల శాఖ ఉయ్యూరు డిఈఈ బలరాం తదితర అధికారులు పాల్గొన్నారు.

