మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను త్వరలో సాకారం
మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను సాధించి తీరుతాం
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
బుధవారం ఢిల్లీలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాబోయే 2026-27 రైల్వే బడ్జెట్ లో రేపల్లె మచిలీపట్నం రైల్వే లైను నిమిత్తం నిధులు కేటాయిస్తున్నారా అని ప్రశ్నించడం జరిగింది. ఈ నూతన రైలు మార్గం కోసం గతంలో అనేక ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయని, ఈ మార్గం వలన కోల్ కతా నుండి చెన్నై వెళ్ళే రైళ్ళు విజయవాడజంక్షన్ మీదుగా వెళ్ళకుండా, మచిలీపట్నం మీదుగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుందని, ఈ మార్గం గుండా రైళ్ళు ప్రయాణిస్తే 55 కిలో మీటర్ల మేరకు దూరం తగ్గడంతో బాటు, విజయవాడజంక్షన్ పైన రైళ్ళ ట్రాఫిక్ భారం కూడా తగ్గుతుందని, ప్రయాణ సమయం కలిసి రావడంతో బాటు సరుకు రవాణా ఖర్చులు కుడా గణనీయంగా తగ్గుతాయని వివరించడం జరిగింది.
త్వరలో పూర్తీ కానున్న మచిలీపట్నం పోర్టు నుండి కుడా సరుకుల రవాణాను తక్కవ ఖర్చుతో చేయవచ్చని ఎంపి వివరించారు. తీరప్రాంతంలో అత్యంతముఖ్యమైన కోస్టల్ లైనుగా ఇది భవిష్యత్తులో ఉపయోగ పడుతుందని, ప్రధానంగా మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణాలో కీలక మార్గం కాబోతుందని పార్లమెంట్ కు వివరించడం జరిగింది.
ప్రతిపాదిత కోస్టల్ రైల్వే కారిడార్ లో ( నరసాపూర్ – మచిలీపట్నం – రేపల్లె – నిజాంపట్నం – బాపట్లలను కలుపుతూ ) ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుందని, అందువలన సదరు మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం యొక్క డి.పి.ఆర్ తయారిని వెంటనే పూర్తిచేసి పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయవలసినదిగా ఎంపి కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్ ని కోరారు.
ఇందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమాధానమిస్తూ, త్వరలో పూర్తీ కాబోతున్న మచిలీపట్నం ఓడ రేవు కు అనుసంధానంగా రైల్వే లైనులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందనియు, రేపల్లె మచిలీపట్నం రైల్వే లైను కూడా ఒక ముఖ్యమైన రైల్వే లైను అని పేర్కొంటూ, 45.30 కి.మీ మేరకు మచిలీపట్నం రేపల్లె కొత్త రైల్వే లైను నిర్మాణం నిమిత్తం సర్వే కు నిధులు మంజూరు చేశామని, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు ఫీల్డ్ సర్వే జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా రేపల్లె బాపట్ల కొత్త రైల్వే లైను ను 46 కి.మీ.మేర దూరంకు సర్వే కొరకు నిధులు మంజూరు చేశామని, అదికూడా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు ఫీల్డ్ సర్వే జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు కు రవాణా నిమిత్తం విజయవాడ – గుడివాడ – మచిలీపట్నం రైల్వే లైను ను డబ్లింగ్ పనులు పూర్తీ చేశామని, సరుకు రవాణాలో దక్షిణ భారత దేశంలోనే మచిలీపట్నం పోర్టు ఒక ముఖ్యమైనదిగా ఉంటుందని అయన తెలిపారు.
అంతేగాకుండా 2014 కు ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే కేటాయింపులు కేవలం 886 కోట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే 9,417 కోట్ల రూపాయల కేటాయింపులు చేసిందని తెలుపుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తగిన విధంగా రైల్వే కేటాయింపులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

