The Desk…Eluru : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పాత్రికేయులకు పిలుపునిచ్చిన ఏలూరు MLA చంటి

The Desk…Eluru : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పాత్రికేయులకు పిలుపునిచ్చిన ఏలూరు MLA చంటి

  • పీఐబి విజయవాడ వారి ఆధ్వర్యంలో ఏలూరులో పాత్రికేయులకు వార్తాలాప్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రజల జీవన పురోగతిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఏలూరు శాసససభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాత్రికేయులకు పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) – విజయవాడ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన వార్తాలాప్ కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వార్తాలాప్ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ప్రజల్లో విస్తృత ప్రచారంతో అవగాహన కల్పించాలని, అప్పుడే ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకొని పురోగతిని సాధించగలుగుతారని రాధాకృష్ణయ్య అన్నారు.

ఇది వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడుతుందని, ఇందుకోసం పాత్రికేయులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రాచుర్యం కోసం పీఐబీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

భారత ప్రభుత్వం, మీడియా సంస్థలకు మధ్య పీఐబీ నమ్మకమైన వారథిగా నిలుస్తుందని పీఐబీ-విజయవాడ డైరెక్టర్ జీ.సురేష్ కుమార్ అన్నారు. మీడియా సంస్థలు సంచలనాత్మక వార్తలను అందజేయడమే కాకుండా ప్రజోపయోగ, అవగాహనాత్మక కథనాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

విశ్వసనీయమైన, వాస్తవాధారిత వార్తల్ని ప్రజలకు చేరువ చేసేందుకు పాత్రికేయులంతా కృషి చేయాలన్నారు. మీడియా ద్వారా పాత్రికేయులు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు.

మీడియా రంగంలో చోటు చేసుకున్న ఆధునిక సమకాలీన మార్పులు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఫేక్ న్యూస్ కు సంబంధించిన పరిష్కార మార్గాలపై పాత్రికేయులకు రాష్ట్ర సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖలో డిప్యూటేషన్ లో ఉన్న నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ అనిత అవగాహన కల్పించారు.

ప్రస్తుత సామాజిక మాధ్యమ ప్రపంచంలో మీడియా పాత్ర రోజురోజుకు అనేక మార్పులకు లోనవుతుందన్నారు. విస్తృతంగా ప్రజలకు చేరుతున్న సమాచారంలో వాస్తవాలు నిర్థరించుకోవడం కష్టంగా మారిందన్నారు. ఈ సమయంలో పాత్రికేయులే విశ్వసనీయమన సమాచారాన్ని అందించే బాధ్యతల్ని చేపట్టాలని, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని కోరారు.

నామమాత్రపు ప్రీమియంతోనే దేశ పౌరులకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రకాల జీవిత బీమాలు, ప్రజల జీవన ప్రమాణాల్ని పెంపొందించేందుకు అందిస్తున్న రుణ పథకాల గురించి యూనియన్ బ్యాంక్ డిస్టిక్ లీడ్ మేనేజర్ డి. నీలాద్రి, పాత్రికేయులకు అవగాహన కల్పించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ముద్ర యోజన, పీఎంఈజీపీ వంటి పథకాలపై అవగాహన, ప్రయోజనాలు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాలను వివరించారు. ఈ సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.

రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యానవన పంటల సాగులో, పామాయిల్, కోకో, కొబ్బరి దిగుబడిలో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సజా నాయక్ తెలిపారు.

ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలు, ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, వాటి సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలు, లాభాల్ని పాత్రికేయులే రైతులకు చేరవేయాలన్నారు.

ప్రజల ఆరోగ్య రికార్డుల్ని డిజిటల్ పద్ధతిలో భద్రపరిచి, అత్యవసర సమయాల్లో సులువుగా, కచ్చితమైన వైద్య సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) గురించి డాక్టర్ భార్గవి, చీఫ్ అసిస్టెంట్ సర్జన్(సిఏఎస్) వివరించారు. ఇందులో నమోదు చేసుకునే ప్రక్రియ, ప్రయోజనాల గురించి, గర్భిణీ స్త్రీలకు, గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు వైద్య సదుపాయాల పరంగా అందజేస్తున్న సౌకర్యాలు, సదుపాయాల గురించి వివరించారు.

మహిళల భద్రత, సంరక్షణ కొరకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధి విధానాలు, వీటిని అనుసరించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నెలకొల్పాల్సిన వ్యవస్థలు గురించి పాత్రికేయులకు ఐసీడీసీ నోడల్ ఆఫీసర్ (ఉమెన్ & చైల్డ్) తులసి తెలియజేశారు.

జిల్లాలో వర్కింగ్ వుమెన్స్ కోసం నిర్వహిస్తున్న వసతి గృహాలు, బాలబాలికల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్ల గురించి ప్రజలకు తెలియజేయాలని, తద్వారా అవసరమైన వారికి ఉపయోగపడేలా పాత్రికేయులు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో సీబీసీ సహాయ సంచాలకులు ఆర్, రమేష్ చంద్ర, పీఐబీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.