The Desk…Machilipatnam : బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు

The Desk…Machilipatnam : బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు

  • దుకాణాలను సముద్ర తీరానికి దూరంగా ఏర్పాటు చేయించాలి

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

మంగినపూడి బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం లో భాగంగా పర్యావరణం కోసం జీవనశైలి— సేవా పర్వ్ 2025 పేరుతో మంగినపూడి బీచ్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ తొలుత బీచ్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, నగరపాలక సంస్థ, ఆక్వా పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణం బాగుండాలన్నారు.

మనం పర్యావరణము నుండి గాలి పీల్చుకుంటున్నామని పర్యావరణం శుభ్రంగా ఉంటే మనకు ఎటువంటి జబ్బులు రావన్నారు. తన చిన్నతనంలో ఇంటి నుండి మార్కెట్ కు వచ్చినప్పుడు చేతిలో సంచి తీసుకొని వచ్చే వారమన్నారు. అదే ఏదైనా ఒక హోటల్ కి పార్సల్ కోసం వెళితే ఒక స్టీల్ టిఫిన్ బాక్స్ తీసుకువెళ్లే వారమన్నారు.

రాను రాను ఆ అలవాటు తప్పిపోయి యూస్ అండ్ త్రో సంస్కృతికి అలవాటు పడిపోయారన్నారు. దుకాణం వాళ్లు ఇచ్చే ప్లాస్టిక్ సంచులను తీసుకొని రావడం పడేయడంతో చెత్త పేరుకుపోయి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామన్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

ముఖ్యంగా ప్లాస్టిక్ సంచులను మురికి కాలువలో వేయడంతో అందులో నీరు ప్రవహించక నీరు అక్కడే ఉండి దోమలు వృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయన్నారు. దీంతో ఆ దోమల వలన మలేరియా వంటి రకరకాల జబ్బులు వస్తున్నాయన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో మెదడు తినే కొత్తరకం అమీబా వలన 19 మంది చనిపోయారన్నారు. అదే నిల్వ ఉన్న నీటిలోనీ మైక్రో ఆర్గానిజమ్స్ నుండి వస్తుందన్నారు.

అందుకే మన ప్రవర్తన నడవడికలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 17వ తేదీ నుండి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. మంగినపూడి తీర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచాల్సిన కనీస బాధ్యత ముఖ్యంగా ఇక్కడకు వచ్చే పర్యాటకులపై ఉందన్నారు.

బీచ్ కు వచ్చే వారు ఆనందంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా గడపాలని బీచుకు వస్తుంటారని, వెళ్లేటప్పుడు ఆహారం తినేసి చెత్తాచెదారాలను బీచ్ లో ఎక్కడబడితే అక్కడ వదిలేసి వెళుతున్నారన్నారు. ఆ విధంగా చేయడం వలన ఆ తదుపరి వచ్చే పర్యాటకులకు ఎంతో అసౌకర్యం కలుగుతుందన్నారు. అంతే కాకుండా పర్యావరణ దెబ్బతింటుందన్నారు.

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను వాడకం తగ్గించాలని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలన్నారు. దీంతో చాలా మార్పు వస్తుందన్నారు.బీచ్ ను సుందరంగా ఉంచాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. కలెక్టరేట్లో కొత్తగా వచ్చినప్పుడు ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడే వారని, ఆ తర్వాత ప్లాస్టిక్ నీటి సీసాలను వాడకం రద్దు చేశామని, స్టీలు నీటి సీసాలను కొనుగోలు చేసి అందరికీ పంపిణీ చేశామని, చిన్న చిన్న ఆలోచనలతో మార్పు మనతోనే మొదలు కావాలన్నారు.

ఇకపై మనం బయటకు వస్తే తప్పనిసరిగా సంచిని తీసుకునే అలవాటును పునరుద్ధరించాలన్నారు. మంచి పర్యావరణాన్ని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలలో విజేతలైన వారికి జిల్లా కలెక్టర్, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వీరయ్య కళాబృందం , గుడివాడ వారు ప్రదర్శించిన కళాజాత అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.అనంతరం జిల్లా కలెక్టర్ అందరితో కలిసి బీచ్ లో ఉన్న చెత్తాచెదారాలను ఏరివేత కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం జిల్లా కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై పర్యావరణ పరిరక్షణ అందరూ పాటించాలని సంతకం చేశారు.

అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ఫ్లెక్సీపై సంతకం చేశారు. తదుపరి జిల్లా కలెక్టర్ అధికారులు విద్యార్థులు సిబ్బంది అందరి చేత పర్యావరణ పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్ సముద్ర తీరం సమీపంలో చెత్త ఎక్కువ ఉండడం గమనించి వివిధ రకాల తినుబండారాలు విక్రయించే దుకాణాలు బీచ్ తీరం దగ్గరికి వచ్చాయని, దీంతో చెత్తాచెదారం ఎక్కువగా తీరం సమీపంలో పర్యాటకులు తిని పారేయడం జరుగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వెంటనే దుకాణాలను సముద్ర తీరానికి దూరంగా ఏర్పాటు చేయించాలని జిల్లా కలెక్టర్ తహసిల్దారు నాగభూషణం, ఎంపీడీవో వెంకటేషులకు సూచించారు.

కార్యక్రమంలో కలెక్టర్ వెంట న్యూ ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర పర్యావరణ శాఖ సెక్షన్ అధికారి అశోక్ కుమార్, కాలుష్య నియంత్ర మండలి ఈ ఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటక అధికారి రామ లక్ష్మణ, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గోపాలరావు, మెరైన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్, పలువురు నగరపాలక సంస్థ సిబ్బంది, విద్యార్థులు, ఆక్వా ఉద్యోగులు పాల్గొన్నారు.