The Desk…Eluru : జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు అన్నదాతా సుఖీభవ అందించాలి : జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల

The Desk…Eluru : జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు అన్నదాతా సుఖీభవ అందించాలి : జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల

  • రైతుల నుండి అభ్యంతరాలను స్వీకరించి అర్హులైన ఏ ఒక్క రైతును విస్మరించకుండా అన్నదాతా సుఖీభవ వర్తింపజేయాలి
  • తదుపరి డిఆర్సీ సమావేశం నాటికి జిల్లాలో కనీసం 4 ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయాలి

ఏలూరు జిల్లా సమీక్షా సమావేశంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర పౌర సరఫరాలు, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :

జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు అన్నదాతా సుఖీభవ పధకాన్ని వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం జిల్లా సమీక్షా సమావేశం ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, డా. కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు,సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అన్నదాతా సుఖీభవ పధకంలో లక్షా 60 వేల 968 లక్షల మంది రైతులకు 107. 08 కోట్ల రూపాయలు అందించామని, అర్హత కలిగి, ఆధార్ నంబర్ పొరపాటుగా నమోదు, తదితర కారణాలతో అన్నదాతా సుఖీభవ పొందని రైతుల నుండి ఈనెల 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరణకు గడువు ఇచ్చామని, ఈ అంశంపై రైతులకు అవగాహన కలిగించి, అర్హత కలిగిన ఏ ఒక్క రైతును విస్మరించకుండా అర్హత కలిగిన ప్రతీ రైతుకి అన్నదాతా సుఖీభవ పధకాన్ని వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామ స్థాయిలోని వ్యవసాయ శాఖ సిబ్బంది వారి పరిధిలో అర్హత కలిగి అన్నదాత సుఖీభవ పధకం పొందని రైతుల వివరాలను తీసుకుని, వారిని ఆన్లైన్లో అభ్యంతరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేస రైతులను మోసం చేసే ఏ ఒక్కరినీ వదలకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

జిల్లాలో వృద్ధి రేటు పెంచేందుకు అవకాశం ఉన్న ఉద్యానవన పంటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న ప్రోత్సాహం, సబ్సిడీలపై గ్రామస్థాయిలో అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో యూరియా, డిఏపి ఎరువులకు ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆయిల్ పామ్ గెలలు కోసే సమయంలో రైతు కూలీలు విద్యుద్ఘాతం తో మృత్యువాత పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలన్నారు. 2014-19 సంవత్సరాల సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో చేపట్టిన పనులలో పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో కొత్తగా 8550 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లాలో మొత్తం 6 లక్షల 18 వేల 864 రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 34 వేల 838 అంత్యోదయ అన్నయోజన కార్డులు మంజూరు చేశామని, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు కూడా అందించామని, మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే పేద గిరిజనులకు అంత్యోదయ అన్నయోజన కార్డులు అందిస్తామన్నారు.

జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. తదుపరి జిల్లా సమీక్షా సమావేశం నాటికి కనీసం 4 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ..

సాగులో నానో ఎరువులు, సేంద్రియ ఎరువుల వినియోగం పెరిగేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. మామిడి పంటకు ఎటువంటి చీడపీడలు సోకకుండా పూత దశకు ముందుగానే సమస్యను గుర్తించి, ఆ ప్రాంతంలోని రైతులకు మందులు అందించాలన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులతో రైతులు మోసపోకుండా సంబంధిత విత్తన,ఎరువుల కంపెనీలతో ప్రతీ రైతు అగ్రిమెంట్ చేయించుకునేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పి ఎం ఏ వై., ఎన్టీఆర్ గృహ నిర్మాణ కాలనీలలో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద చేపట్టాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పధకం కింద రైతులు అందించిన భూములలో సాగుకు అవసరమైన బోర్లు వంటి సౌకర్యాలకు అనుమతించాలన్నారు. ఇరిగేషన్ చానెల్స్ లో పూడికతీత పనులను కనీసం 2 అడుగులు లోతు వరకు తీయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో వేతనాల పద్దులో ఎక్కువశాతం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గత సంవత్సరంలో అక్రమ మైనింగ్ చేసిన వారిపై అపరాధరుసుంగా విధించిన 3 కోట్ల రూపాయలు వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేలేరుపాడు మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ షట్టర్ మరమ్మత్తు పనులను తెలంగాణా ప్రభుత్వం వారి సమన్వయంతో చేపట్టాలన్నారు. నూజివీడు లో ఆటోనగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన భూమి సేకరణకు తాను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి పార్థసారథి చెప్పారు.

2014-19 ఉపాధి హామీ పనులు చేపట్టిన పనులకు సంబందించిన బిల్లులు చెల్లింపులు పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అందరూ ఏఈ లతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని రెవిన్యూ సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ...

జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వరద ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు పునరావాస కేంద్రాలలో వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ.. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో ఏలూరు నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పధకంలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపులు చెయ్యాలని కోరారు. . తల్లికి వందనం పధకంలో విద్యుత్ అధిక వినియోగం వంటి కొన్ని కారణాలతో అర్హులైన వారికి వర్తింపచేయలేదని, సదరు సమస్యలను పరిష్కరించి అర్హులైన ప్రతీ ఒక్కరికి తల్లికి వందనం వర్తింపచేయాలని కోరారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల అందించడంలో కోపరేటివ్ సొసైటీలో ఆధారు కార్డు చూపించమని ఓటిపి కారణాలతో జాప్యం జరుగుతుందని, సమస్యని పరిష్కరించాలని కోరారు. అన్నదాత సుఖీభవ రైతులు నుండి ఎటువంటి ఫిర్యాదు ఒకటి కూడా అందలేదని, అయితే ఇంకా మిగిలిఉన్న రైతులను గుర్తించి అన్నదాత సుఖీభవ నూటికి నూరుశాతం మొదటివిడత సాయం నందించాలన్నారు.

డెల్టా ప్రాంతంలో కూడా పామాయిల్ తోటలు ఎక్కువగా వేస్తున్నారని అందుకు తగ్గట్టుగా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలను నెలకొల్పాలని అన్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లులు వలన కొంతమందికి తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని అవికూడా పూర్తిగా జమ అయ్యేలా చూడాలన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూముల లభ్యతకు తాను సహకరిస్తానని, ఎంఎస్ఎంఈ పార్కు పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ పనులకు రావలసిన పెండింగు బకాయిలు ఉన్నాయని, నిధులను విడుదల చేసి అప్లాండు ప్రాంత అభివృద్ధికి, ఉపాధి శ్రామికులకు ఉపాధికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. తెలంగాణ సరిహద్దులో చింతలపూడి నియోజకవర్గం ఉందని స్త్రీ శక్తి పథకంలో అంతర రాష్ట్ర సర్వీసులకు ఉచిత బస్సు అమలు కావడంలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ… కొల్లేరు గ్రామాలలో అభయారణ్యం పేరుతో మౌలిక సదుపాయాలైన రోడ్లు, త్రాగునీరు సౌకర్యాల ఏర్పాటుకు అటవీ శాఖ వారు అడ్డుకుంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. సొసైటీలో కౌలు రైతులకు ఎరువులు ఇచ్చుట లేదని వారికి సభ్యత్వం ఉండదు కనుక ఈ సమస్య తలెత్తుతుందని పరిష్కారం చూపాలన్నారు. భారీ వర్షాల కారణంగా పెద్దయాడ్లగాడి వద్ద ఉప్పుటేరు లో తూడు,గుర్రపుడెక్క అడ్డు పడుతున్న కారణంగా కొల్లేరు ప్రాంతంలో ముంపు ప్రమాదం పొంచివుందని, తాను తమ స్వంత సొమ్ముతో ప్రోక్లైన్లు ఏర్పాటు చేస్తానని నాతో సహా మా టీమ్ దగ్గర ఉంటామని జిల్లా యంత్రాంగం సహకారం అందించి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు బారిన పడిన రైతులు ఉన్నారని, వారికి న్యాయం చేయాలనీ కోరారు. సత్యసాయి త్రాగునీటి పధకం ద్వారా గిరిజన గ్రామాలలో త్రాగునీరు అందించాలని కోరారు. గిరిజన గ్రామాలలో విద్యా, వైద్య, రవాణా సౌకర్యాలు మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ.. నారాయణపురం బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేయాలనీ, ఇది రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.