🔴 దిల్లీ/ఏలూరు : ది డెస్క్ :
ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వర్జీనియా పొగాకు, పామాయిల్ రైతుల సమస్యలను కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్ళారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో కలిసిన ఎంపీ పుట్టా మహేష్.. 2024- 25 ఏడాదిలో ఏపీ రైతులు 80 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేయగా, కేంద్రం 60 మిలియన్ కేజీల పొగాకు విక్రయాలకే అనుమతి ఇచ్చిందని, ఇప్పటి వరకూ 35 మిలియన్ కేజీలు మాత్రమే సేకరించారని, ఈ సీలింగ్ తొలగించి, రైతుల వద్ద ఉన్న అదనపు పొగాకును కూడా విక్రయించడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.
పామాయిల్ రైతుల సమస్యలను కూడా కేంద్రమంత్రి దృష్టికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీసుకువెళ్ళారు. ఇటీవల పామాయిల్ దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్న పరిస్థితులను కూడా ఎంపీ కేంద్ర వాణిజ్య మంత్రి శ్రీ పియూష్ గోయల్ దృష్టికి తీసుకు వచ్చారు. ముడి పామ్ ఆయిల్ CPO ధరను టన్నుకు రూ.1,25,000/- ఉండేట్లు చూడాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు
.సమస్యలను సావధానంగా విన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అతి తక్కువ పెనాల్టీతో అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.