- రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల వినియోగంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
- పనికట్టుకుని కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపాటు
- సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల సరఫరా ఆలస్యం అవ్వకూడదు
వ్యవసాయ అధికారులకు వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశం
🔴 అమరావతి/ విజయవాడ : ది డెస్క్ :
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు అన్ని సహాకార సంస్థలలో, ప్రైవేట్ కంపెనీలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని, కొరత సంభవించే అవకాశం ఉంటే ముందుగానే గ్రహించి ఎరువుల సరఫరా పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువులు, వాటి సరఫరా, కొన్ని ప్రాంతాలలో యూరియా సరఫరాపై అందుతున్న సమాచారం పై మంగళవారం విజయవాడలో వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి సహాకార సంస్థను అధికారులు పర్యవేక్షిస్తూ, అందరికి ఎరువులు అందుతున్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తో సంప్రదించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ పరిమాణంలో ఎరువులను రాష్ట్రానికి తెప్పించినా కూడా పలు ప్రాంతాలలో యూరియా సరఫరాపై పత్రికలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించి వాటి కారణాల గురించి మంత్రి వాకబు చేశారు.
*ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ* శ్రీకాకులం జిల్లాలో ఎరువుల కొరత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ ను మంత్రి ప్రశ్నించగా వంశధార ప్రాజెక్టు లో ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల విస్తీర్ణం పెరిగిందని, జిల్లాకు 12000 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని అందుకు గాను 18000 మెట్రిక్ టన్నుల ఎరువులు (9000 సొసైటీలు+ 9000 ప్రైవేట్ కంపెనీలకు) అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ మంత్రికి వివరించారు.
రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొనటానికి విముఖత చూపిస్తున్నారని , వారు గ్రామంలో ఉన్న రైతు సేవాకేంద్రాలకు ఎరువులు అందించాలని కోరుతున్నారని తెలిపారు. గతంలో ఎరువుల తక్కువ అవసరం ఉన్న ఆర్ ఎస్ కే (RSK) లకు ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేశారని తెలిపారు. ప్రభుత్వ కోట 50 శాతం ఎరువులు మన్యం, విజయనగరం జిల్లాల సొసైటీలు, ఆర్ ఎస్ కే (RSK) లకు వెళ్తున్నాయని, శ్రీకాకుళం జిల్లాకు ప్రైవేట్ డీలర్ లకు వెళ్తున్నాయని తెలిపారు.
ప్రైవేట్ డీలర్ల వద్ద వీఆర్ఓ (VRO) ల పర్యవేక్షణలో అమ్మిస్తున్నామని తెలిపారు. నంద్యాల, అవనిగడ్డ కు సంబంధించి వచ్చిన వార్తలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న విషయాలను కొండంతలుగా ప్రచారం చేసి కొంత మంది ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని, వారికి అవకాశం ఇవ్వకూడదు కలెక్టర్లకు మంత్రి సూచించారు. జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రాష్ట్రానికి రావల్సిన బకాయి ఎరువులను వెంటనే రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు మంత్రికి వివరించారు.
ఈ విషయంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో మాట్లాడి త్వరితగతిన యూరియాను రాష్ట్రానికి వచ్చేలా చొరవ చూపుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
*ఎరువుల సరఫరాపై తప్పుడు ప్రచారాలను నమ్మోద్దు*
రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత అంటూ కొన్ని పత్రికలు, వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మోద్దని మంత్రి తెలిపారు. 2025 ఖరీఫ్ సీజన్ కు రాష్ట్రంలో 16.76 లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులను (యూరియా- 6.22 లక్ష టన్నులు; డి.ఏ.పి – 2.60 లక్ష టన్నులు; ఎం.ఓ.పి – 0.70 లక్ష టన్నులు; యస్ యస్ పి – 0.94 లక్ష టన్నులు; కాంప్లెక్స్ లు – 6.30 లక్ష టన్నులు) పంపిణీకి కార్య చరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 7.14 లక్ష మెట్రిక్ టన్నుల (యూరియా 2.98 లక్ష మెట్రిక్ ట న్నులు, డి.ఏ.పి – 0.46 లక్ష మెట్రిక్ టన్నులు, ఎం.ఓ.పి- 0. 65 లక్ష మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి – 0.45 లక్ష మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు- 2.59 లక్ష మెట్రిక్ టన్నులు) ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఏప్రిల్ నుండి ఆగస్ట్ 5వ తేదీ వరకు రాష్ట్రంలో 8.11 లక్ష మెట్రిక్ టన్నుల అవసరం (జూలై నెలవరకు) కాగా, 8.80 లక్ష మెట్రిక్ టన్నుల (యూరియా -2.91 లక్ష మెట్రిక్ టన్నులు, డి.ఏ.పి – 1.48 లక్ష మెట్రిక్ టన్నులు, ఎం. ఓ పి – 0.21 లక్ష మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి – 0.73 లక్ష మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు- 3.48 లక్ష మెట్రిక్ టన్నులు) ఎరువులు సరఫరా అయ్యాయని తెలిపారు.
ఖరీఫ్ పంట కాలానికి 15.94 లక్ష మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు (యూరియా- 5.89 లక్ష మెట్రిక్ టన్నులు, డి.ఏ.పి – 1.94 లక్ష మెట్రిక్ టన్నులు, ఎం. ఓ పి – 0.87 లక్ష మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి – 1.18 లక్ష మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు – 6.07 లక్ష మెట్రిక్ టన్నులు), రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.
*రైతాంగానికి అందుబాటులో ఎరువులు*
ఏప్రిల్ నుండి ఆగస్ట్ 5వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొత్తం 8.91 లక్ష మెట్రిక్ టన్నుల (యూరియా-3.77 లక్ష మెట్రిక్ టన్నులు, డి.ఏ.పి-1.06 లక్ష మెట్రిక్ టన్నులు, ఎం.ఓ.పి – 0.47 లక్ష మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి -0.62 లక్ష మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు – 2.98 లక్ష మెట్రిక్ టన్నులు) ఎరువుల విక్రయాలు జరిగాయని తెలిపారు.
ఆగస్ట్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 7.03 లక్ష మెట్రిక్ టన్నులను (యూరియా -2.11 లక్ష మెట్రిక్ న్నులు, iడి.ఏ.పి- 0.88 లక్ష మెట్రిక్ టన్నులు, ఎం. ఓ పి- 0.39 లక్ష మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి -0.56 లక్ష మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు – 3.09 లక్ష మెట్రిక్ టన్నులు), కో ఆపరేటివ్ సొసైటీలలో, ఆర్.ఎస్.కె లలో, మార్క్ ఫెడ్ గోదాములలో, రిటైల్/హోల్ సేల్, మరియు కంపెనీ గోదాములలో ఎరువులును రైతాంగానికి అందుబాటులో ఉన్నాయని వివరించారు. మార్క్ ఫెడ్ మరియు కో ఆపరేటివ్ సొసైటీలలో 1.41 లక్ష మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను అందుబాటులో ఉంచి, మిగిలిన ఖరీఫ్ సీజన్ కు అంతరాయం లేకుండా సరఫరా చేయటానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పై ఎరువుల నిల్వలతో పాటుగా ఆగష్టు 2025 నెలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4.58 లక్ష మెట్రిక్ టన్నులు ఎరువులు భారత ప్రభుత్వం ద్వారా (యూరియా- 1.65 లక్ష మెట్రిక్ టన్నులు, డి.ఏ.పి- 0.72 లక్ష మెట్రిక్ టన్నులు, ఎం. ఓ పి -0.20 లక్ష మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు- 1.80 లక్ష మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి – 0.22 లక్ష మెట్రిక్ టన్నులు ) కేటాయించడం జరిగిందని వీటి సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నదన్నారు.
రాష్ట్రం లో ఇప్పటివరకు ఎటువంటి యూరియా సరఫరాలో జాప్యం రాకుండా కో ఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవ కేంద్రాలు మరియు ప్రైవేట్ దుకాణాల ద్వారా గ్రామములో రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. దేశీయంగా ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాలు యూరియాను ఉత్పత్తి చేస్తున్నాయని, అలాగే విదేశాలనుండి కూడా అవసరమైన యూరియా దిగుమతులు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన పంట కాలం లో కూడా యూరియా సరఫరాలలో ఎటువంటి ఇబ్బంది రాదని మంత్రి తెలియజేశారు.
రాష్ట్రానికి ఆగష్టు నెలలో 1.65 లక్ష మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 16000 మెట్రిక్ టన్నులు జిల్లాలకు సరఫరా అయిందని, రాబోవు వారం రోజులలో మరో 27000 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరాకు తగిన చర్యలు చేపట్టామని తెలిపారు.
నూతనంగా రూపొందించబడిన సాంకేతికంగా అభివృధి పరచిన నానో యూరియా , నానో డి ఏ పి ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఇవి సాంప్రదాయ ఎరువులకు అనుబంధంగా పంటల ఎదుగుదలలో తోడ్పడతాయని, నానో ఎరువులను ఉపయోగించు విధానంలో అనుకూలతను దృష్టిలో ఉంచుకుని వాడవలసిన మొత్తం పరిమాణంలో 25 శాతం మూలకాలను నానో ఎరువుల ద్వారా పంటలకి అందించొచ్చని అన్నారు.
ఎవరైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి , ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా , ఎరువులను మళ్లింపు చేసిన, ఎం ఆర్ పి ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్రయించిన వారి లైసెన్స్ లు రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం 1985, ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
*పనిగట్టుకుని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు*
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని మంత్రి అన్నారు. తాము ఎంత మంచి ప్రజలకు చేస్తుంటే అందుకు భిన్నంగా మంచి ప్రభుత్వంపై పనిగట్టుకుని వైసీపీ ఆలీ బాబా 40 దొంగలు తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24 సంవ్సర కాలంలో పీఏసీఎస్, ఆర్ ఎస్ కే ల ద్వారా 6 లక్షల 17 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తే , కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25 కాలంలో ఇదే పీఏసీఎస్, ఆర్ ఎస్ కే ల ద్వారా 6 లక్షల 99 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందచేశామని మంత్రి తెలిపారు.
రైతులకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించి ఎక్కువ మొత్తంలో ఎరువులను అందచేశామని, సరైన వివరాలు తెలుసుకుని వైసీపీ నేతలు మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. కాకీ లెక్కలు చెప్పి ఎన్నాళ్లు పబ్బం గడుపుకుంటారని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రత్యేక వ్యవసాయ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా సహకార అధికారులు, జిల్లా మార్క్ ఫెడ్ జనరల్ మేనేజర్లు ,ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.