The Desk…Gunturu : “గివింగ్ బ్యాక్ టు సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం : జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి

The Desk…Gunturu : “గివింగ్ బ్యాక్ టు సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం : జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి

గుంటూరు జిల్లా : గుంటూరు : ది డెస్క్ :

నిస్సహాయులకు, పేదలకు “గివింగ్ బ్యాక్ టు సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల(జి జి హెచ్)కు ఎదురుగా తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న టిఫిన్ బండిని జీయంసీ అధికారులు తొలగించారని.. టిఫిన్ బండి పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక వెంకట్రావుపేట కు చెందిన ఆలవాల యశ్వంత్ అనే బాలుడు సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాల్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మికి వినతి పత్రం అందించాడు.

బాలుడి వినతిని విన్న కలెక్టర్ జీఎంసీ అధికారులకు స్థలాన్ని కేటాయించాలని ఆదేశించడంతో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించి జీజీహెచ్ ఎదురుగా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించారు. పత్రికలు, టీవీ లలో వచ్చిన వార్తల నేపధ్యంలో “గివింగ్ బ్యాక్ టూ సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి మంగళవారం సాయంత్రం కలక్టరేట్ వద్ద కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా బాలుడి తల్లి అలవాల రాధికకు టిఫిన్ బండి అందజేశారు.

తమ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా కొత్త టిఫిన్ బండి అందజేసిన “గివింగ్ బ్యాక్ టూ సొసైటీ” స్వచ్చంధ సేవా సంస్థ ప్రతినిధులకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గివింగ్ బ్యాక్ టూ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించారు. సేవా భావంతో చేసే కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. సమాజసేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన ఎవరైనా సరే సమాజం కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించాలని, ఉన్నత కుటుంబాలకు చెందిన వారు దీన్నో బాధ్యతగా భావించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి సూచించారు