- రైల్వే అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశం
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
తమ గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్ కు అడ్డుగా అధికారులు ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వట్లూరు గ్రామానికి చెందిన రైతులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు విన్నవించారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను గురువారం గ్రామానికి చెందిన రైతులు కలిసి తమ సమస్యను వివరించారు.
రైల్వే ట్రాక్ కు అడ్డుగా ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేయడం వల్ల సుమారు రెండు కిలోమీటర్ల పైగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైల్వే అధికారులకు ఫోన్ చేసి తక్షణం ఇనుప గడ్డర్లు తొలగించాలని ఆదేశించారు. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో పశువులు అడ్డుగా రావడం వల్ల తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే ట్రాక్ కు అడ్డుగా ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేశామని అధికారులు ఎంపీకి వివరణ ఇచ్చారు.
రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో పశువులు అటువైపు వెళ్ళకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటారని, తక్షణం ఇనుప గడ్డర్లు తొలగించి సమస్య పరిష్కరించాలని ఎంపీ సూచించారు. అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతులతో మాట్లాడారు. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. సమస్యను తెలియజేయగానే తక్షణం స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వల్లూరు గ్రామం చెందిన రైతులు కృతజ్ఞతలు తెలిపారు.