🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నా.. గల్లీలో ఉన్నా తన సాయం కోరి వచ్చే వారికి ఎల్లప్పుడు అండగా ఉంటారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి నిరూపించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కనూరు మండలానికి చెందిన 30 మంది దివ్యాంగులు వైకల్యం నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఆన్లైన్ సదరంలో స్లాట్ బుక్ చేసుకోగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్లిప్పులు జారీ అయ్యాయి.
అయితే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైకల్యం పరీక్షలకు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు సుమారు 150 కిలోమీటర్ల దూరభారం నుంచి వచ్చిన దివ్యాంగులు దిక్కుతోచని స్థితిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయాన్ని సంప్రదించారు. తక్షణం స్పందించిన ఎంపీ కార్యాలయం ప్రతినిధులు సదరం శిబిరానికి వెళ్లి దివ్యాంగులకు తక్షణం పరీక్షలు నిర్వహించేలా అధికారులతో మాట్లాడి మండు వేసవిలో దివ్యాంగులు జంగారెడ్డిగూడెం వెళ్లకుండా ఏలూరులోని వైకల్యం నిర్ధారణ పరీక్షలు చేయించారు.
వైకల్యం నిర్ధారణ పరీక్షల అనంతరం తమ స్వగ్రామాలకు దివ్యాంగులు తిరుగు ప్రయాణం కాగా భోజనం సమయం కావడంతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అదేశాలతో కార్యాలయం ప్రతినిధులు భోజనం వసతి కల్పించారు. మండుటెండలో వచ్చిన దివ్యాంగులు భోజనం చేసిన అనంతరం ఎంపీ కార్యాలయంలో కొద్దిసేపు సేదతీరి తిరిగి పయనవయ్యారు. తాము ఫోన్ చేసి సంప్రదించగానే తక్షణం స్పందించి తమకు సేవలందించిన ఎంపీ కార్యాలయం ప్రతినిధులకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన తమను అక్కున చేర్చుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు.