NTR జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

దోనేపూడి శంకర్బుడమేరు డైవర్షన్ కాల్వకు మరమ్మత్తులు చేపడుతూ.. ముడుమేరు ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు.
బుడమేరు ప్రారంభం నుండి కొల్లేరులో కలిసి వరకు, కొల్లేరు నుండి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించకుండా పంట పొలాలను, పట్టణ,గ్రామీణ ప్రజలను కాపాడలేమన్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద బుడమేరు సహజ ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించి బుడమేరు ప్రక్షాళనలకు చర్య చేపట్టాలని శంకర్ డిమాండ్ చేశారు.
మంగళవారం సిపిఐ ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బుడమేరు ఛానల్ శాంతినగర్ నుండి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వరకు పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించింది. డైవర్షన్ కాల్వకు జనవరిలోనే ప్రారంభించాల్సిన పనులు ఇప్పుడు చేపట్టటం వలన వర్షాలు వస్తే పనులన్నీ కుంటపడిపోతాయని దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మరమత్తులకు పనులను నిర్ణయించడంలోనూ, డబ్బులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని ద్వజమెత్తారు. జూన్ లో వరదలు వస్తే విజయవాడ మరోసారి ముంపుకు గురికావాల్సి వస్తుందన్నారు.
సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రమేష్ మాట్లాడుతూ.. సకాలంలో మరమత్తులు పనులు పూర్తి చేయకపోతే ఈ ఏడాది కూడా ఖరీఫ్ లో రైతులు పంటలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. బుడమేరులో కలిసే వాగుల గండ్లను వెంటనే పోర్చుటలో అలసత్వం కనపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య మాట్లాడుతూ.. గత ఏడాది బుడమేరు ముంపు వల్ల కృష్ణా, ఎన్టీఆర్ ,ఏలూరు జిల్లాలలో లక్షలాది ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని, అధిక స్థాయిలో రైతాంగం నష్టపోయిందన్నారు. నష్టపోయిన వారీలో కౌలురైతులే 90 శాతం మంది ఉన్నారన్నారు.
ఈ అనుభవాల నుండి గుణపాఠం తీసుకోకుండా మాయమాటలు చెప్పి మభ్య పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయటం సిగ్గుచేటు విమర్శించారు.బుడమేరు సంబంధించి ఒంపులన్నీ తొలగించి మార్గం మధ్యలో ఉన్న వంతెనల ఎత్తు పెంచాలన్నారు. ఎనికేపాడు వద్ద ఉన్న అండర్ టన్నెల్ వెడల్పు చేసి మరిన్ని తూమ్ లు ఏర్పాటు చేసి ముడమేరు నీరు కిందకు పారేలా ఏర్పాట్లు చేయాలన్నారు.అప్పుడే విజయవాడ ముంపు తగ్గుతుందన్నారు.
ఎనికెపాడు నుండి సముద్రంలో కలిసే వరకు ఉన్న ఆక్రమణలు తొలగించడమే కాకుండా భవిష్యత్తులో బుడమేరు ప్రవాహానికి ఆటంకం లేకుండ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతినిధి బృందంలో ఎన్టీఆర్ జిల్లా యూత్ కార్యదర్శి లంక గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.