THE DESK NEWS పార్వతీపురం ఇసుక సరఫరా ఉచితమే

THE DESK NEWS పార్వతీపురం ఇసుక సరఫరా ఉచితమే

పార్వతీపురం, (ద డెస్క్ న్యూస్ ) జూలై 27 :

ఇసుక సరఫరా ఉచితమేనని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక సరఫరా ఉచితమే అని, ఇసుక తవ్వి తీయుటకు, ఇతర నిర్వహణకు, రవాణాకు  జరిగే ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇతర ఖర్చులు ఏమి ఉండదని, దానిని అధికారులు పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. స్థానికంగా ఉండే చిన్న రీచ్ లకు మార్గదర్శకాలు రావలసి ఉందని, అటువంటి చోట్ల జేసిబీలు వినియోగించారాదని ఆయన స్పష్టం చేశారు. ఇసుక రీచ్ ల వద్ద తాగు నీటి వసతులు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినరాదని ఆయన అన్నారు. ఒడిషా అనుమతులతో ఆంధ్రా ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అనుమతులు లేని రీచ్ లలో తవ్వకాలు జరగరాదని అన్నారు. అనుమతులు లేని చోట్ల చేస్తే భారీ అపరాధ రుసుములు విధించడం జరుగుతుందని, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇసుక సరఫరా పక్కాగా జరగాలని, ప్రతి అంశానికి రికార్డులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రీచ్ లు నిర్వహించాలని ఆయన అన్నారు. జిల్లాకు అవసరమగు ఇసుక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని ఆయన ఆదేశించారు. వంశధార నదీ తీరంలో కొత్త ఇసుక రీచ్ ల లభ్యతను గుర్తించాలని ఆయన సూచించారు. భామిని మండలం కాట్రగడ వద్ద అనుమతుల మేరకు ఇసుక వెలికి తీసి 10 రోజుల్లో కార్యకలాపాలు మొదలు పెట్టాలని జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశం నిర్ణయించింది. నేరేడి, పసుపూడి వద్ద ఇసుక రీచ్ లను ప్రారంభించుటకు ప్రతిపాదనలు సమర్పించాలని కూడా నిర్ణయించింది. జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 43 ప్రకారం జూలై 8వ తేదీ నుండి ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. కిలోమీటర్ల దూరం మేర రవాణా చార్జీలు విధించడం జరుగుతుందని, దీనిని ఖరారు చేయడం జరుగుతోందని అన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ వి మాధవ రెడ్డి, పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి వి వెంకట రమణ, జిల్లా గనుల శాఖ అధికారి కె శ్రీనివాస రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా రవాణా అధికారి ఎం శశి కుమార్ , జిల్లా భూగర్భ జలాలు శాఖ అధికారి ఎ రాజశేఖర రెడ్డి, వంశధార ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.